Mother and daughter died in a car accident At Bandlaguda : ఉదయం నడకకు వెళ్లిన ఆ తల్లి, కుమార్తెను మృత్యువు వెంటాడింది. కారు రూపంలో వచ్చి ఇద్దరినీ బలి తీసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదర్ షా కోట్‌లోని లక్ష్మి నరసింహా కాలనీలో ఉండే అనురాధ, ఆమె కుమార్తె మమత రోజులానే.. ఈ రోజు ఉదయం కూడా మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో వెళ్లగా.. అదే కాలనీలో నివాసం ఉంటున్న కవిత అనే మరో మహిళ కూడా వీరిద్దరితో వాకింగ్‌కు వెళ్లింది.
ముగ్గురు కలిసి ప్రధాన రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. కాస్త దూరం వెళ్లగానే మృత్యువు కారు రూపంలో వీరిపై దూసుకొచ్చింది. వెనుక నుంచి కారు వీరిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు గాల్లో లేసి రహదారి పక్కకు ఎగిరి పడ్డారు. కారు అదే వేగంతో వెళ్లి.. ఇంతియాజ్ అనే మరో వ్యక్తిని ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదంలో తల్లి అనురాధ, కుమార్తె మమత సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కవిత తీవ్రగాయాల పాలవడంతో నానల్‌నగర్‌లో ఉన్న ఆలివ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఒంటరి వాడైన కుమారుడు: ఇంతియాజ్ కాలు విరగడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇద్దరినీ అత్యవసర చికిత్స విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనురాధ రెండేళ్ల క్రితం లక్ష్మీ నరసింహ కాలనీలోని పద్మనాభరెడ్డి ఇంట్లో కుమార్తె, కుమారుడితో కలిసి అద్దెకు ఉంటోంది. కుమారుడు సాయి కిరణ్ గోల్కొండ మున్సిపాలిటీ ఆఫీస్‌లో పొరుగుసేవల విభాగంలో పనిచేస్తున్నాడు. కుమార్తె మమత ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. తల్లి సోదరి చనిపోవడంతో సాయికిరణ్ ఒంటరి వాడయ్యాడు. ప్రమాదంలో గాయపడిన కవిత తన ముగ్గురు కుమార్తెలతో కలిసి అదే కాలనీలో ఉంటుంది.
Car accident at Narsingh : పెద్ద కుమార్తె ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. మిగతా ఇద్దరు కుమార్తెలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ముగ్గురు కుమార్తెలు ఆందోళన చెందుతున్నారు. మాసబ్ ట్యాంక్‌కు చెందిన బద్రుద్దీన్ అవినాష్ డిగ్రీ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి.. మెయినాబాద్ బయల్దేరారు. స్నేహితుడు రహీం కారు తీసుకురావడంతో నలుగురు అందులో పయనమయ్యారు. బద్రుద్దీన్ కారు నడుపగా మిగతా ముగ్గురు సీట్లల్లో కూర్చున్నారు.