Badangipet Mayor joins congress: అధికార తెరాసకు మరో షాక్ తగలనుంది. తాజాగా మరో మేయర్ తెరాస పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హైదరాబాద్ శివారు బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి హస్తం గూటికి చేరేందుకు నిర్ణయించారు. రాజీనామా లేఖను రంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షుడికి పంపించారు.
అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా తెరాసను వీడుతున్నట్లు ఆమె తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ మధ్యాహ్నం పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డితో కలిసి పారిజాత రెడ్డి దిల్లీకి వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. హస్తినలో పార్టీ పెద్దల సమక్షంలో మేయర్ పారిజాత రెడ్డితోపాటు మరికొందరు తెరాస నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే తెరాస నాయకులు ఎవరనే విషయాన్ని బయటకు రాకుండా కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.