అంతా సక్రమంగా జరిగితే ఇప్పుడు ఆక్రమించిన రెండెకరాలతో పాటు మరో ఐదెకరాల మేర మూసీ నదిని పూడ్చి రియల్ వెంచర్‌గా వేసి విక్రయించాలనే ప్రణాలికను కబ్జాదారులు సిద్ధం చేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని "ఈటీవీ భారత్" వెలుగులోకి తేవడంతో కబ్జా బాగోతానికి అడ్డుకట్ట పడింది. రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్‌గూడ రెవెన్యూ పరిధిలో మూసీ నది కబ్జాలపై "కళ్లు మూసుకున్నారా?" అనే శీర్షకతో మంగళవారం " ఈటీవీ భారత్"లో ప్రచురితమైన కథనానికి వివిధ శాఖల అధికారులు స్పందించారు. మూసీ నది అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్, ఎస్‌ఈ మల్లిఖార్జున్, రంగారెడ్డి జిల్లా డిప్యూటి కలెక్టర్ మాలతీ, రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్‌తో పాటు నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రెండెకరాల కంటే ఎక్కువ స్థలం కబ్జాకు గురైనట్లు చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ తెలిపారు.
నది మధ్య భాగంలో లారీల రాక పోకల కోసం వేసిన మట్టి రోడ్డును అధికారులు జేసీబీలతో ధ్వసం చేశారు. కబ్జాలపై పూర్తి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు. కబ్జాకు పాల్పడిన వారి పూర్తి వివరాలు తెలుసుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ కబ్జా చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజేంద్రనగర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
' ఉన్నతాధికారుల ఆదేశాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నాం. స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కబ్జా జరిగిన ప్రదేశం మూసీ నది పరివాహక ప్రాంతానికి చెందినదిగా గుర్తించాం. ఈ వ్యవహారంపై స్థానిక తహసిల్దార్ రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. వారి ఆదేశాల ప్రకారం ఆక్రమణకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటాం'. - మాలతీ, డిప్యూటి కలెక్టర్, రంగారెడ్డి జిల్లా.