ఈటీవీ, ఈనాడు కథనానికి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడలో గల మూసీ కాలువలో కొందరు భూ బకాసురులు రాత్రికి రాత్రి మట్టిపోసి మూసి వేస్తున్నారన్న సమాచారాన్ని ఈనాడు పత్రికలో చూసి మూసీ రివర్‌ఫ్రంట్ అధికారులు సందర్శించారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే మూసీకాలువ స్థలాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు వేసి కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఈనాడు 'కళ్లు మూసీకున్నారా' అనే శీర్షికతో ప్రచురించింది.
ఈనాడు కథనాన్ని చూసిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ తమ సిబ్బందితో కలిసి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. మూసీ నదిలో మట్టిపోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వెంటనే మూసీ నది నుంచి బండరాళ్లు, మట్టిని జేసీబీ సహాయంతో తొలగిస్తామని పేర్కొన్నారు. మూసీ నదిలో భూ కబ్జాలపై మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తామని మోహన్ నాయక్ వెల్లడించారు. మూసీ రివర్, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని... బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు.