Assistant Professor turned into a labor in Hyderabad: అతను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. బంగారం లాంటి కుటుంబం.. గౌరవాన్ని ఇచ్చే వృత్తి. సమస్యలు లేని జీవితం. అంతా సాఫీగా సాగిపోతోంది. అయినా ఏదో తెలియని వెలితి. ఎందుకో జీవితమంటే అసంతృప్తి. ఆ వెలితి తన జీవితంలో మార్పును కోరుకునేలా చేసింది. అంతే ఉన్నపళంగా ఉద్యోగాన్ని, కుటుంబాన్ని వదిలి.. ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అతను హమాలీగా మారాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. ఖమ్మం దూరాభారం కావడంతో అక్కడి నుంచి రాలేక కళాశాలకు దగ్గరలోని వసతి గృహంలో అద్దెకు ఉంటున్నాడు. అందరితోనూ బాగానే కలసిమెలసి ఉంటున్నా.. ఈ నెల 7వ తేదీన ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని జాడ ఎవరికి తెలియకపోవడంతో.. హాస్టల్ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబీకులు వారికి తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో.. ఈ నెల 17న అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే విచారణను ప్రారంభించిన పోలీసులు వారికి అనుమానం వచ్చిన అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇన్స్పెక్టర్ స్వామి ఆదేశాలతో ఎస్ఐ సునీల్కుమర్ బృందం రంగంలోకి దిగి.. యువకుడి కుటుంబ సభ్యులు, వసతి గృహంలో ఉన్న తన రూమ్మేట్స్, విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.