రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడలో పండ్ల మార్కెట్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో ఏప్రిల్ మాసం చివర్లో హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా కోహెడకు మార్చారు. క్రయవిక్రయాలు సాగించారు. ఈ క్రమంలో మే 4న భారీ వర్షం, ఈదురు గాలుల తీవ్రతకు తాత్కాలిక షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ఫలితంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మార్కెట్ కమిటీ అధికారులు గడ్డి అన్నారం, ఉప్పల్ రెండు చోట్లా మళ్లీ మామిడి క్రయ, విక్రయాలు ప్రారంభించారు. కోహెడలో మార్కెట్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
గతంలో కోహెడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్మాణం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో లోపభూయిష్టంగా సాగింది. ఫలితంగా ఈదురు గాలులకు షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వ్యవస్థ అంతా పూర్తిగా స్థంభించిపోయింది. సుమారు 1.5 కోట్ల నిధులు వృథా అయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మరో 1.5 కోట్లతో మార్కెట్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో గడ్డి అన్నారం నుంచి మార్కెట్‌ను తరలించేందుకు మళ్లీ మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కమిషన్ ఏజెంట్లు, రైతులతో కీలక సమావేశం జరగనుందని గడ్డిఅన్నారం ఏఎంసీ ప్రత్యేక శ్రేణి-1 కార్యదర్శి యెండ్రపల్లి వెంకటేశం తెలిపారు.