Anganwadi Teachers Dharna: అంగన్వాడీ టీచర్లకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీలు.. లక్డీకాపూల్లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని 7 ప్రాజెక్టుల్లో 2000కు పైగా అంగన్వాడీ టీచర్లు పని చేస్తున్నారని... యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాధిక తెలిపారు. గత 20ఏళ్ల క్రితం నుంచి అరకొర సౌకర్యాలతో విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి లేచి మరీ పని చేస్తున్నాం
2జీ మొబైల్ ఫోన్ ఇచ్చి ఆరోగ్య లక్ష్మీ పథకానికి సంబంధించి 24 రకాల సేవలు ఆన్లైన్లో చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా అంగన్వాడీ టీచర్లు 14 రకాల రికార్డులు రాయాలని పేర్కొన్నారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు.. కేంద్రాల్లో భోజనం చేసిన తర్వాత వారి కళ్లను ఫోన్ ద్వారా ఫొటో తీయడానికి చాలా సమయం తీసుకుంటోందని వెల్లడించారు. ఇప్పటికే పోషక్ ట్రాకర్‌లో 8 రకాల సేవలు నమోదు చేస్తున్నట్లు... మొబైల్‌కు సిగ్నల్స్ అందక అర్ధరాత్రి లేచి చేయాల్సి వస్తోందని వాపోయారు. అదనంగా పనిభారం పెరిగి టీచర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా 2017 నుంచి రావాల్సిన టీఏ, డీఏ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ. 21 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Telangana Budget Sessions 2022-23 : మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు