లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో అత్యవసర సమయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాచకొండ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కమిషనరేట్ పరిధిలోని వృద్ధులు, మహిళలు, రోగులకు ఇబ్బంది కలగకుండా రాచకొండ పోలీసులు మహేంద్ర లాజిస్టిక్స్ సంస్థతో కలిసి ఏడు కార్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అవసరమైనప్పుడు రాచకొండ కంట్రోల్ రూం నంబర్ 9490617234కు ఫోన్ చేసి సమస్య తెలియజేసి... వాహన సౌకర్యం పొందవచ్చు. రెండు అంబులెన్స్‌లను కమిషనరేట్ పరిధిలో సేవలు అందించేందుకు సిద్ధం చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
వారికి సలహాలు, సూచనలు
మద్యం లభించకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు మానసిక నిపుణుల బృందాన్ని రాచకొండ పోలీసు అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. వింతగా ప్రవర్తించే వారి గురించి... కుటుంబసభ్యులు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే సూచనలు, సలహాలు ఇస్తారు. అవసరమైన వారు ఆయా సౌకర్యాలు వినియోగించుకోవాలని సీపీ వివరించారు.