తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Meeting: ఇవాళ కాంగ్రెస్‌ 'దళిత, గిరిజన దండోరా' రెండో సభ - రావిర్యాల సభ

కాంగ్రెస్‌ రెండో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహణకు సర్వం సిద్ధమయ్యాయి. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో.... ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఈ దండోరా సభకు లక్షమందికిపైగా జనం వస్తారన్న అంచనాతో... కాంగ్రెస్‌ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. మరోవైపు వర్షం పడుతోందనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతోంది.

all set for Congress party second Meeting in raviryala
all set for Congress party second Meeting in raviryala

By

Published : Aug 18, 2021, 4:23 AM IST

Updated : Aug 18, 2021, 9:07 AM IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన మొదటి దండోరా సభ విజయవంతం కావడంతో అదే ఊపుతో కాంగ్రెస్​ ఇవాళ రెండో సభను ఏర్పాటు చేసింది. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం రావిర్యాలలో సభ నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న రావిర్యాలలో దాదాపు 40 ఎకరాల స్థలంలో ఈ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మల్​రెడ్డి రామిరెడ్డిలు రావిర్యాల సభ ఏర్పాట్లను దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. దళిత, గిరిజన సభ కావడంతో... ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన అంబేడ్కర్‌, కుమురం భీంల ఫోటోలను భారీ కటౌట్లతో స్టేజి దగ్గర ఏర్పాటు చేయడంతో ఇంద్రవెల్లి సభలో అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ రావిర్యాలలో కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

ప్రోటోకాల్​పై దృష్టి...

ఇంద్రవెల్లి సభలో కొంతమంది నాయకులు మాట్లాడేందుకు అవకాశం రాకపోగా... ఎమ్మెల్యే సీతక్కను సభాధ్యక్షురాలిగా పెట్టడంపై, స్టేజిపై అర్హత లేని నాయకులు చాలా మంది తిష్ఠవేయడంతో... అసలు నాయకులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాలపై ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల ముఖ్యనాయకుల సమావేశంలో చర్చ జరిగింది. కొందరు ఈ విషయాలపై నిరసన కూడా వ్యక్తం చేసి... ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని దళిత, గిరిజన సామజిక వర్గాలకు చెందిన నాయకులను సభల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. మరొకవైపు... ప్రోటోకాల్‌ ప్రకారం స్టేజి మీదకు నాయకులను ఆహ్వానించాలని తద్వారా ముఖ్య నాయకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా స్థానిక నాయకులనే సబాధ్యక్షులుగా ఉంచాలని కొందరు నాయకులు పేర్కొనడంతో... వాటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి... ఇలాంటి లోపాలను సరిదిద్దాలని పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సూచించారు. ఏఐసీసీ స్థాయిలో పాటిస్తున్న ప్రోటోకాల్‌ను ఇక్కడ రాష్ట్రంలో జరిగే సభల్లో కూడా పాటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అదే విధంగా స్టేజి మీదకు ఎవరెవరిని, ఎంత మందిని ఆహ్వానించాలన్న దానిపై కఠినంగా వ్యవహరించాలని... ఇందులో ఎవరికి ఏలాంటి మినహాయింపులు ఉండవని కాంగ్రెస్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతకు మించి...

ముఖ్యమంత్రి కేసీర్ దళిత బంధు అధికారికంగా ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మొదటి సభ. ఇంద్రవెల్లి మొదటిది కాగా రావిర్యాలలో నిర్వహిస్తున్నది రెండో దళిత గిరిజన ఆత్మగౌర దండోరా సభ. హైదరాబాద్‌ నగరానికి దగ్గరల్లో ఈ సభ ఉండడంతో... ఇంద్రవెల్లి సభ కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌ కూడా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ సభలో ఒకరిద్దరు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ktr: 'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'

Last Updated : Aug 18, 2021, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details