రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల భూదాన భూముల వివరాలకు సంబంధించిన నిజానిజాలు నిగ్గు తేల్చాలని అఖిల భారత సర్వసేవ సంఘ్ అధ్యక్షుడు వెదిరె అరవింద్‌రెడ్డి డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని రావినారాయణరెడ్డి కాలనీలో ఆలిండియా సర్వసేవ సంఘ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గాంధేయవాది ఆచార్య వినోబాబావే తెలంగాణలో 1.70లక్షల పైచిలుకు ఎకరాలను సేకరించారని వెదిరె అరవింద్‌రెడ్డి తెలిపారు. భూమిని పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వానికి ఆయన అప్పగించారన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 20 వేల ఎకరాల భూమి పంపిణీ చేయకుండా ఉండిపోయిందని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన భూదాన్ భూములను రాజకీయ నాయకులు, రియల్టర్లు ఆక్రమించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్ భూముల రక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు భూదాన్ భూములు పంపిణి చేసేవరకు ఉద్యమాలు కొనసాగుతాయని వెదిరె అరవింద్‌రెడ్డి వెల్లడించారు.