Niranjan reddy on crops: కేంద్రానికి వ్యాపార ధోరణి తప్ప వ్యవసాయం గురించి తెలియదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని మంత్రి సూచించారు. వానాకాలం సాగు సన్నద్ధతపై రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నేతలు, రైతులతో కార్యశాల నిర్వహించారు. పూలు, కూరగాయల సాగుపై హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల రైతులు దృష్టి సారించాలని ఆయా జిల్లాల మంత్రులు సూచించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన వానాకాలం - 2022 సదస్సుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ప్రపంచంలో తెలంగాణ అభివృద్ధిపై గొప్పగా చెప్పుకోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది వానా కాలంలో 1.40 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, భూసార పరీక్షలు, రసాయన ఎరువుల క్రమబద్ధీకరణ, పంటల మార్పిడిపై చర్చించారు. యాసంగిలో వరి సాగు తగ్గింపు అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. ఒక్క ఇజ్రాయెల్ గురించే కాదు తెలంగాణ గురించి కూడా యావత్ ప్రపంచం గొప్పగా చెప్పకోవాలని మంత్రి తెలిపారు. కేంద్రం మూడేళ్లు సమయం ఇస్తే క్రమంగా వరి సాగు తగ్గిస్తామని చెప్పామని వివరించారు. యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనమంటే కేంద్రం మొండిచేయి చూపిందని ఆక్షేపించారు.
భారతదేశం అవసరాస దృష్ట్యా వ్యవసాయంపై పెద్ద మనసుతో కేంద్రం ఆలోచించకపోగా వ్యాపారాత్మక దృష్టి తప్ప మరోకటి లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి చేస్తే ఇచ్చే ప్రోత్సాహం 5 శాతం రాయితీ రద్దు చేయడం చూస్తే ప్రోత్సహించాల్సిన రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్ని విన్నపాలు చేసినా స్పందించడం లేదని ఆక్షేపించారు. ఏ పంట సాగు చేసినా వరి మించి లాభదాయకమేనని.. ప్రత్యామ్నాయ పంటలసాగుపై దృష్టి కేంద్రీకరించాలని రైతులకు దిశానిర్దేశం చేశారు.
కేంద్రానికి పదుల సార్లు పోయినాం. మీ వద్ద నుంచి ఇన్ని కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలా వస్తోంది అంటారు పీయూష్ గోయల్. మాకు కొంత టైం ఇస్తే మే తగ్గించుకుందామని చెప్పినాం. అయినా వాళ్లు వినలేదు. ఒక్కసారే పంట తగ్గించాలంటే ఎలా సాధ్యం?. కేంద్ర ప్రభుత్వానికి రైతుల ధోరణి లేదు. కేవలం వారిది వ్యాపార ధోరణి. ఈ దేశంలో ఏ పంట వేసుకున్నా వరికంటే లాభం వస్తది. నష్టం వచ్చే పంట ఏదీ లేదు. ఇది వాస్తవం. రైతులు ఈ విషయం గమనించాలి.
- నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు అపారమైన అవకాశాలు, మార్కెట్ ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ ఐటీ, వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని.. తాను ఓ రైతునేనని సేద్యం చేసి ఇప్పుడు ధనవంతుడిని అయ్యానని తెలిపారు. రైతు అనుభవంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించడంతోపాటు ఇటీవల 26 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట వేశానని ఆయన పేర్కొన్నారు. కీలక వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఎనలేని మార్కెటింగ్ ఉందని, రైతులు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతూ అవకాశాలు అందిపుచ్చుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.