3 రోజులు దాటినా నీటిలోనే పలు కాలనీలు హైదరాబాద్‌ను వణికించిన కుంభవృష్టిలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద కష్టాలు తొలగలేదు. 4 రోజులుగా బయటకు వెళ్లే మార్గం లేక పిల్లపాపలతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, హరిహరపురం కాలనీల్లో నీటి ఉద్ధృతి కొంతమేరకు తగ్గినా.. రహదారులు జలమయంగానే ఉన్నాయి. బీఎన్ రెడ్డి పరిసర కాలనీల్లోని స్థానికులు కొంతమంది వరద నీటిలో ఉండలేక ఇళ్లు వదిలేసి వెళ్లిపోగా... మరికొందరు అక్కడే ఉండి వరద నీటితో సావాసం చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోగా కాలనీ వాసులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వరద గుప్పిట్లో
ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు కొనసాగుతోంది. ఎల్‌బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్, రామ్ నగర్, ముషీరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునిగే ఉన్నాయి. బీఎన్ రెడ్డి నగర్‌లోని హరిహరపురంలోని రోడ్ నంబర్ 2, 3, 4 , 5 సహా పలు కాలనీల్లో మోకాళ్ల లోతు నీటిలో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని దుస్థితి. స్థానికంగా ఉన్న కప్పల చెరువు పొంగి పొర్లటంతో చుట్టపక్కలా ప్రాంతమంతా వరద గుప్పిట్లో చిక్కుకుంది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని
బీఎన్ రెడ్డి నగర్‌ను ఆనుకొని ఉన్న హస్తినాపురం రోడ్డు కోతకు గురవడంతో పరిసరకాలనీలకు రాకపోకలు స్తంభించాయి. రోడ్డు మధ్యలో నీరు ప్రవహిస్తుండటంతో.. నడిచేందుకు, వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని నివాసితులు వాపోతున్నారు. ఎక్కడికక్కడ రాళ్లు తేలిన ఈ మార్గంలో నడవటం వల్ల గాయాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రాణాలు అరచేతపట్టుకొని కాలం వెళ్లదీస్తున్నామని సరూర్‌నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనిచేసుకుంటే గానీ పూట గడవని కుటుంబాలను భారీ వర్షం రోడ్డున పడేసిందని గోడు వెల్లబోసుకున్నారు. ఇంట్లోని బియ్యంతో పాటు నిత్యావసరాలు పాడైపోయాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
శాశ్వత పరిష్కారం కావాలి
మల్కాజిగిరి, దోమలగూడ, సూరజ్ నగర్, ఆదర్శనగర్ ప్రాంతాల్లో వరద ముంపు తగ్గినా.. ఇంకా పలు కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లటం, బురదతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. గుడిసెల్లోకి నీరు రావడంతో 3 రోజులుగా రోడ్లు, బస్టాండ్‌ల వద్ద తలదాచుకొని ఇవాళే తిరిగి వచ్చామని కాలనీ వాసులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదముంపు వల్ల ఆస్తినష్టంతో పాటు.. నిత్యావసరాలు, అత్యవసర వైద్యసేవల కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ నిర్మాణాలు, చెరువులకు తూములు సరిగా లేకపోవటం వల్ల వ్యర్థాలు, చెత్త పేరుకుపోయి .. వరదనీరు కాలనీల్లోకి వస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని మొరపెట్టుకున్నారు.
ఇదీ చదవండి:వరదల్లో కోట్లు విలువ చేసే విల్లాలు