2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం.. మహిళలకు సైబర్ బెదిరింపుల కేసులు దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికం(19)గా నమోదయ్యాయి. అలాగే, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల కేసులు మహారాష్ట్రలో గరిష్ఠంగా 388 నమోదు కాగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఇవి 100. ఆన్‌లైన్‌లోనే కాకుండా బయటా మహిళలపై వేధింపుల కేసులు అధికంగానే నమోదయ్యాయి. అతివల్ని వెంబడించి వేధింపులకు పాల్పడుతున్న కేసుల్లో(సెక్షన్ 354డి) తెలంగాణది రెండో స్థానం. ఈ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా 8,229 కేసులు రికార్డయ్యాయి.
మొదటిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2013 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో వాటి సంఖ్య 1436. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 956 కేసులున్నాయి. మహిళల ప్రతిష్ఠకు భంగం కలిగించిన కేసులు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 2,342 నమోదు కాగా.. నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణలో వీటి సంఖ్య 565. ప్రజారవాణా వ్యవస్థలో మహిళలకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా 364 నమోదు కాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 32 శాతానికిపైగా(117) ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్‌లో 59, ఉత్తరప్రదేశ్‌లో 56, కర్ణాటకలో 28, తెలంగాణలో 21 నమోదయ్యాయి. మానవ అక్రమ రవాణా కేసుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. బాలల పోర్నోగ్రఫీ కేసులూ తెలంగాణలోనే అధికంగా 161 నమోదు కావడం గమనార్హం.
ఏ నేరాల్లో తొలిస్థానంలో ఉన్నామంటే..
- భౌతికదాడులు చేసి స్వల్పంగా గాయపరిచిన ఘటనలు తెలంగాణలోనే అత్యధికం. దేశంలో ఏకంగా 24.77 శాతం ఘటనలు ఇక్కడే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 10837 నమోదు కాగా.. తెలంగాణలో ఈ సంఖ్య 2685. తర్వాతి స్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 1799, మధ్యప్రదేశ్‌లో 1392, ఆంధ్రప్రదేశ్‌లో 1150 కేసులున్నాయి.
- ఇతరుల స్థలాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం (క్రిమినల్ ట్రెస్‌పాస్) సంబంధిత నేరాలు తెలంగాణలోనే ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 38897 కేసులకుగాను రాష్ట్రంలోనే అత్యధికంగా 6617 కేసులున్నాయి.
- అంతర్జాలంలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసిన కేసుల్లో తెలంగాణలోనే అత్యధికంగా 273 ఉన్నాయి.
- మానసిక ఆరోగ్య చట్టం, 1987 కింద దేశవ్యాప్తంగా 290 కేసులకుగాను తెలంగాణలోనే ఏకంగా 223 నమోదయ్యాయి.
- ఆహార కల్తీ కేసుల నమోదులో ఉభయ తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 3155, తెలంగాణలో 1498 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం 5165 కేసుల్లో రెండు రాష్ట్రాల్లోనే 90 శాతానికిపైగా కేసులుండటం గమనార్హం.