తెలంగాణ

telangana

తహసీల్దార్​ హత్యకు ఆ ఒప్పందమే కారణమా?

తహసీల్దార్​ విజయారెడ్డి హత్య కేసు భూవివాదం చుట్టూ తిరుగుతోంది. రెవెన్యూ కోర్టు కేసులను కారణంగా చూపుతూ పాసు పుస్తకాలను జారీ చేసేందుకు విజయారెడ్డి తిరస్కరించడంతోనే ఈ హత్య జరిగిందా..? రైతులు రక్షిత కౌలు దారులకు భూములను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న వారే సురేష్​ను ఉసిగొల్పారా? లేక అతని అప్పులను ఆసరాగా చేసుకుని ఈ ఘాతుకాన్ని చేయించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Nov 7, 2019, 5:18 AM IST

Published : Nov 7, 2019, 5:18 AM IST

Updated : Nov 7, 2019, 8:26 AM IST

abdullapurmet-mro-vijayareddy-muder-update-issue

తహసీల్దార్​ హత్యకు ఆ ఒప్పందమే కారణమా?

నగర శివారు అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాచారం గ్రామంలోని 413 ఎకరాల వివాస్పద భూములు స్థిరాస్తి వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. ఈ భూములకు వాస్తవ పట్టాదారు రాజా ఆనందరావు. గౌరెల్లి, బాచారం, బండ రావిరాల తదితర గ్రామాలకు చెందిన రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు.

భూవివాదం

రక్షిత కౌలుదారు హక్కు చట్టం కింద ధృవీకరణ పత్రం కూడా పొందినట్లు తెలుస్తోంది. పట్టాదారు రాజా ఆనందరావు అందుబాటులో లేనందున... రక్షిత కౌలుదారుకు 1950 నుంచి సాగుచేసుకుంటున్న రైతులను అక్కడి నుంచి పంపించేసే ధైర్యం లేదు. దీన్ని ఆసరా చేసుకుని అనుభవదారులు, రక్షిత కౌలుదారులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఇద్దరి నుంచి వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్​ను బట్టి తెలుస్తోంది. కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే దక్కించుకుని అదును చూసి దీన్ని మార్కెట్ ధరకు విక్రయిస్తున్నారు.

అప్పులు తీర్చుకునేందుకే

ఇదే ప్రాంతంలో సురేష్ తాత వెంకయ్యకు 7 ఎకరాలు ఉంది. ఇందులో సురేష్ తండ్రి కృష్ణయ్య వాటా 2 ఎకరాలు మాత్రమే. మిగతా 5 ఎకరాల భూమి సురేష్ పెదనాన్న దుర్గయ్యకు చెందినది. ఏ పనీ చేయకుండా జులాయిగా ఉన్న సురేష్​కు అప్పులు పెరిగిపోయాయి. ఇంటి మొత్తాన్ని కృష్ణయ్యే వెెళ్లదీస్తున్నాడు. అయితే రెండు ఎకరాల్లో ఓ ఎకరం అమ్మేసి అప్పులు తీర్చాలని సురేష్ భావించాడు.

భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను

స్థిరాస్తి వ్యాపారులతో ఉన్న పరిచయాలతో తన భూమిని అమ్మేందుకు సురేష్ ప్రయత్నించాడు. మరోవైపు బాహ్య వలయ రహదారి సమీపంలోనే భూములు ఉండటం వల్ల స్థిరాస్తి వ్యాపారుల కన్ను వాటిపై పడింది. రికార్డుల ప్రకారం ఆ భూముల టైటిల్ రైతుల దగ్గర లేదు. ఈ క్రమంలో సురేష్ ద్వారా విషయం తెలుసుకున్న వ్యాపారులు రంగంలోకి దిగి రైతులతో సంప్రదించారు. రక్షిత కౌలుదారు హబీబ్ కూడా ఇందుకు అంగీకరించడం వల్ల కొంత అడ్వాన్స్ ఇచ్చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్, హైకోర్టు కూడా అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో హబీబ్ భూములను విక్రయించేందుకు ఒప్పుకోలేదు.

పక్కా పథకం ప్రకారమే

రైతులకు పాస్ పుస్తకాలు అందితే వారి దగ్గరి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్థిరాస్తి వ్యాపారులు భావించారు. అప్పుడు రక్షిత కౌలుదారు హబీబ్ ముందుకొస్తాడని ఆశించారు. రెవెన్యూ కోర్టు కేసులు పెండింగ్​లో ఉండటంతో పాసు పుస్తకాలు జారీ చేయడం కుదరదని తహసీల్దార్ విజయారెడ్డి స్పష్టం చేయడంతో వారు అయోమయ స్థితిలో పడ్డారు. అప్పులు తీరుస్తామంటూ సురేష్​కు ఆశచూపారు. కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విజయా రెడ్డిని బెదిరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏ సమయంలో వెళ్ళాలి, ఎక్కడికి రావాలి అనే అంశాలపై పక్కా పథకం రూపొందించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో స్థిరాస్తి వ్యాపారుల పరోక్ష పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పలువురిన ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి​ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?

Last Updated : Nov 7, 2019, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details