RMP Doctor killed Wife in Shankarpally : ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగింది. ఈ మధ్యే కుటుంబ కలహాలు వారి మధ్య చిచ్చురేపాయి. క్షణికావేశానికి లోనైన ఆ భర్త భార్య గొంతుకోసి హత్యచేశాడు. ఇది గమనించిన వారి కుమారుడు తండ్రికి అడ్డుపడ్డాడు. దీంతో ఆ బాలుడిని చంపేందుకు ప్రయత్నించాడు. ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకొని సదరు బాలుడు.. తన తమ్ముడిని తీసుకొని బయటకు పరుగు తీసి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంటి పక్కన వారి దగ్గరకు వెళ్లి భయపడుతూ తమ ఇంట్లో జరిగినదంతా చెప్పారు. చిన్నారులు చెప్పిన విషయంతో షాకైన స్థానికులు.. వారి ఇంటికి వెళ్లి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. భార్యను చంపిన తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భావించి వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, సుధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి దీక్షిత్, అక్షిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. కోపంలో నాగరాజు.. కత్తితో భార్య సుధ గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.