శివారుల్లో కరోనా విజృంభిస్తున్న వేళ.. జల్‌పల్లి మున్సిపాలిటీపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉన్న 28 పురపాలికల్లో అత్యధికంగా ఒకే పురపాలికలో ఏకంగా 51 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తొలుత మర్కజ్ లింకులతో కేసులు వెలుగు చూడగా.. తాజాగా పహాడీషరీఫ్ ప్రాంతంలో జరిగిన వేడుక కారణంగా భారీగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు కంటెయిన్‌మెంట్ జోన్ ఏర్పాటు చేసి సర్వే చేశారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా జల్‌పల్లి పురపాలికను ఏడాదిన్నర కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి జనవరిలో ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువుదీరింది. కాస్త కుదురుకుని అభివృద్ధి పనులు ప్రారంభించేలోపే కరోనా మహమ్మారి కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి.
మున్సిపాలిటీ పరిధిలోని వాజి-కా-జుమన్ ప్రాంతంలో ఏప్రిల్ 1న తొలి పాజిటివ్ కేసు నమోదైంది. అదే కుటుంబంలోని నలుగురికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చిన నేపథ్యంలో పాజిటివ్ కేసులు బయటపడినట్లు గుర్తించారు. అదే నెలలో వాజి-కా-హబీబ్, షాహీన్‌నగర్, పహాడీషరీఫ్ ప్రాంతంలో మరో నాలుగు కేసులు వచ్చాయి. ఆయా ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేసులు రాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు నయమై తిరిగి రావడం, నిర్దేశిత సమయం ముగియడంతో కంటెయిన్‌మెంట్ ప్రాంతాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.