ఆలూరు....! నిన్న మొన్నటి వరకు ఇదొక చిన్న గ్రామం. నేడు పోలీసుల ఊరుగా రాష్ట్రమంతటా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామ జనాభా సుమారు 10 వేలు. గ్రామస్థులకు వ్యవసాయమే జీవనాధారం. తల్లిదండ్రులు సాగుతోపాటు కూలీనాలీ చేసుకొని తమ పిల్లల్ని చదివిస్తున్నారు. యువత కూడా కన్నవారికి సాయం చేస్తూనే... తమ కలల్ని నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే గ్రామానికి చెందిన 30 మంది యువత... తాజా తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. ప్రభుత్వ కొలువులు సాధించారు.
పట్టుదలే ఆయుధం...
ఆలూరు గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన వారే. 70 మంది ఉపాధ్యాయులు, 40 మంది ఆర్టీసీ కండక్టర్లు, నలుగురు రైల్వే ఉద్యోగులు కాగా భారత సైన్యంలో 10 మంది వరకు పనిచేస్తున్నారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన స్థానిక యువత.. పోలీసు ఉద్యోగాలపై మక్కువ పెంచుకుంది. గ్రామ యువత ప్రతి రోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి గ్రామంలోని పాఠశాల మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. పరుగు, లాంగ్ జంప్, హై జంప్ సాధన చేసేవారు. అలా తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ ఈ గ్రామానికి చెందిన 23 మంది అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు.
లక్ష్యం చేరేవరకు...
ఆ కుటుంబంలో ఐదుగురు ఆడపిల్లల్లో చిన్నది... శ్రీవాణి. ఇంట్లో ఒక్కరికన్న ఉద్యోగం రాలేదని బాధ పడే తండ్రి అభిలాషను నెరవేర్చి ఆ ఇంట ఆనందాన్ని నింపింది. కిరాణ కొట్టు నడుపుతూనే కానిస్టేబుల్ ఉద్యోగానికి కష్టపడింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన భువనేశ్వరికి చిన్న వయస్సులో పెళ్లైంది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. తల్లి వద్దే ఉంటూ కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది. వివాహ బంధంలో సమస్యలు వచ్చినా వాటన్నింటిని పక్కన పట్టి లక్ష్యం చేరుకుంది.
ఓటమి పలకరించినా...
కానిస్టేబుల్ అయిన తండ్రి అనుకోని కారణాల వల్ల ఉద్యోగానికి దూరం కావటం నర్సింగరావును బాధించింది. ఎలాగైనా కానిస్టేబుల్ కావాలని రెండు సార్లు ప్రయత్నించాడు. ఓటమి పలకరించినా పట్టుదలతో శ్రమించి... మూడోసారి అర్హత సాధించాడు. వ్యవసాయ పనులు చేస్తూనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్ చేసి ఎలక్ట్రిషియన్ పనిచేస్తున్న శివరాజ్... తమ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక్కరైనా సర్కారు కొలువు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు.