Mega Diary plant in Raviryala in Rangareddy : రాష్ట్రంలో పాల ఉత్పత్తి, పాడి రైతులను బలోపేతం చేయాడానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. రాయితీపై పాడి పశువుల పంపిణీ, బ్యాంకు రుణాల కల్పన, విజయ డెయిరీ సహా కరీంనగర్, ముల్కనూరు, మదర్ వంటి సహకార రంగంలో ఉన్న డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తోంది. 42 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 5 ఎకరాల్లో అత్యాధునిక నాణ్యత ప్రమాణాలు, హంగులు, మౌలిక సదుపాయాలతో కూడిన 5 నుంచి 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల మెగా డెయిరీ ప్లాంట్ కొలువు తీరబోతోంది. మొత్తం 8 విభాగాలు ఉండనున్నాయి. మిల్క్ పైపు బ్రిడ్జి, సివిల్ పనులు, లేబొరేటరీ, నెయ్యి శుద్ధి, వెన్న తయారీ, ఐస్‌క్రీం ప్యాకింగ్, ఐస్‌క్రీం మిక్స్ ప్రిపరేషన్, పెరుగు ప్యాకింగ్, శీతలీకరణ కోసం పీఠం వంటి విభాగాల పనులు సాగుతోన్నాయి. జూన్ 15 నాటికి ప్లాంట్ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నయని తెలంగాణ పాడి పరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ సోమ భరత్‌కుమార్ తెలిపారు.
జాతీయ పాడి పరిశ్రామిభివృద్ధి సంస్థ, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో తాజాగా మెగా డెయిరీ ప్లాంట్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే మెగా డెయిరీ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తైన దృష్ట్యా... మిగతా 30 శాతం పనులు శరవేగంగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశాలు జారీ చేయడంతో ఓ కదిలిక వచ్చింది. ఎన్‌డీడీబీ ఈ మెగా డెయిరీ ప్లాంట్‌కు కన్సెల్టెంటెన్సీ సేవలు అందిస్తుండగా... కచరా డిజైన్ కన్సల్టెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సాంకేతిక సహకారం అందిస్తోంది. రాబోయే రోజుల్లో నాణ్యమైన పాలు సరఫరా చేయడంతోపాటు రైతులకు మంచి గిట్టుబాటు ధరలు ఇవ్వాలన్నది తమ లక్ష్యమని విజయ డెయిరీ ఉన్నతాధికారులు తెలిపారు.