111 GO Effect in Rangareddy District: 111 జీవో.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల ప్రజల నోళ్లలో బాగా నానే పేరు ఇది. ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్షాలకు ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు ఆయుధంగా మారిన జీవోగా కూడా ఇది గుర్తింపు పొందింది. నగర శివార్లలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన ఈ జీవో చుట్టూ పెద్దఎత్తున రాజకీయాలు నడిచాయి.
111 GO Effect On 84 Villages: కానీ, ప్రజలకు చేకూరిన ప్రయోజనాలకంటే రాజకీయ పార్టీలకు, స్థిరాస్తి వ్యాపారులకే ఈ జీవో వల్ల ఎక్కువ లబ్ధి జరిగింది. ఈ జీవోపై న్యాయస్థానాల్లో గట్టిగానే పోరాటం సాగింది. కానీ, గతేడాది ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి.. 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఆ జీవోలో ప్రజలకు ఇబ్బందిగా మారిన 3వ పేరాను సవరిస్తూ.. కొత్తగా జీవో 69ను జారీ చేసింది.
భూముల విలువ రెండు రెట్లు అధికం: ఇన్నాళ్లు తమకు అడ్డుగోడగా నిలిచిన 111 జీవో నుంచి విముక్తి కలిగిందని ప్రజలంతా సంబురపడ్డారు. అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న భూముల క్రయ విక్రయాలు, నిర్మాణాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. భూముల విలువ కూడా రెండు రెట్లు పెరిగింది. కానీ, ఈ హడావిడి అంతా నెలరోజుల్లోనే ఆవిరైంది. కొత్తగా జారీ చేసిన జీవోలో విధి విధానాలు స్పష్టంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
111 to 69 GO Effect In Rangareddy District: 111 జీవోను సవరించి.. 69 జీవోను జారీ చేసిన సమయంలో ప్రభుత్వం హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను రెండు జలాశయాలు 27.59 శాతం తీర్చవచ్చని చెప్పింది. రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నుంచి 602 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుందని కూడా తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1.25 శాతం కంటే తక్కువున్న పరిస్థితుల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇది ఆధారం కాబోదని వివరించింది.
111 GO Impact On 84 Villages: వీటితో పాటు జంట జలాశయాల్లో నీటి నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినరాదని షరతు విధించింది. నీటి నాణ్యత మెరుగుపర్చేందుకు వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించడం, జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం, భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణ, కాలుష్య తీవ్రత తగ్గింపు తదితర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జీవో 69 తీసుకువచ్చిన తర్వాత చేపట్టాల్సిన చర్యల కోసం విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, పీసీబీ సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి చర్యలు చేయాలి. అలాగే, గ్రీన్ జోన్లు.. సహా జోన్ల నిర్ధారణ కోసం విధివిధానాలను కూడా సిఫారసు చేయాల్సి ఉంటుంది.
జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడాలి: ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు, రహదార్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణం కోసం నిధుల సమీకరణ మార్గాలను చూపాల్సి ఉంటుంది. వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం వ్యవస్థ ఏర్పాటు, లే అవుట్‌లు, భవన అనుమతుల కోసం నియంత్రణా చర్యలు సూచించాలి. జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు.. ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పన కోసం నిధుల సమీకరణ మార్గాలపై కూడా కమిటీ దృష్టి సారించాల్సి ఉంది.
69 జీవో వచ్చి ఏడాది గడిచినా ఎలాంటి అధ్యయనం చేయలేదు:దీనిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని 69వ జీవోలో కమిటీ ఆదేశించింది. 69 జీవో వచ్చి ఏడాది గడిచినా కమిటీ ఎలాంటి అధ్యయనం చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జీవో పరిధిలోకి వచ్చే లక్షా 32 వేల ఎకరాల భూముల్లో ఎక్కడి వరకు గ్రీన్ జోన్, ఎక్కడి వరకు ఫ్రీ జోన్ అనేది స్పష్టత లేదని అంటున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల విషయంలో శంకర్‌పల్లి మండలంలోని బుల్కాపూర్, మహరాజ్ పేట, జన్వాడ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు.
కానీ, నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. జీవోలో స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో గత పరిస్థితులే ప్రస్తుతం కూడా నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, బ్యాంకర్లు కూడా తమకు రుణాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. రైతుల వాదన ఇలా ఉంటే.. స్థిరాస్తి వ్యాపారులకు మాత్రం 69 జీవో కోట్లు కుమ్మరించింది.