ఒకప్పుడు తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వందలాది మంది మళ్లీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. మహేందర్ యాదవ్ తల్లి రామవ్వ షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఒకేసారి రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో సిబ్బందిని వెంటనే నియమించాలన్నారు. ప్రభుత్వం వద్దే 54 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేస్తుకున్నారని.. వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం హామీ నేరవేర్చలేకపోయారని.. కనీసం నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని కోరారు. ప్రజాసమస్యలపై వైఎస్ఆర్టీపీ ఎప్పుడూ పోరాడుతూ ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.