Young Man Suicide Selfi Video Viral At Rajanna Sirisilla : "బాధగా ఉంది ఇక చనిపోయే సమయం దగ్గరకొచ్చింది.. బావా నేను వెళ్లిపోతున్న.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి. నాకు బతకాలని ఉన్నా తప్పడం లేదు. చెల్లికి మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి. పెళ్లి టైంలో నా ఫోటోను ఎదురుగా పెట్టండి. అరే అక్షయ్, రామన్న, నాగరాజు అన్న బై నేను చనిపోతున్నా" అంటూ గద్గద స్వరంతో ఓ పదిహేనేళ్ల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ మరణించడం రాజన్న సిరిసిల్ల వాసులకు కంటతడి పెట్టిస్తుంది.
కారణం ఏదైనా అందమైన కలలతో మంచి జీవితాన్ని అనుభవించాల్సిన యువత ఇలా అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, మార్కులు తక్కువచ్చాయని మరొకరు, నాన్న సెల్ఫోన్ కొనివ్వలేదని మరొకరు ఇలా చిన్నచిన్న విషయాలకే అందమైన జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనరావుపేట మండలంలో జరిగిన ఓ ఘటనలో దుకాణంలో సిగరెట్ డబ్బా దొంగిలించాడనే ఆరోపణలు చేయడం.. దానిపై పంచాయితీ పెడతామని పెద్దలు బెదిరించడంతో మనస్థాపానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు.
ఇది జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. 15ఏళ్ల యువకుడు చెట్టుకు ఉరి పెట్టుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు తాను చనిపోవడం బాధగా ఉందని చెల్లి పెళ్లి చేసేనప్పుడు తన ఫోటోను ఎదురుగా పెట్టి పెళ్లి చేయాలని.. తన స్నేహితులను పేరుపేరునా గుర్తుచేసుకోవడమే కాకుండా తండ్రిని బాధపడొద్దని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. గద్గద స్వరంతో ఆ యువకుడు చెప్పిన మాటలు స్థానికులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
'చాలా బాధగా ఉంది. ఇక చనిపోయే రోజు దగ్గరకొచ్చింది ఇదిగో చూడండి నేను చెట్టుకు ఉరి పెట్టుకున్నాను' అని ఆ వీడియోలో పేర్కొనడం గమనార్హం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయమే ఇంటి నుంచి వెళ్లిపోయిన సదరు యువకుడు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఇంతలో ఆ ఊరు చివర చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవిగా ఉండటం గమనించారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచాకం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని దించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 'ఒక దుకాణం నుంచి సిగరెట్ డబ్బా దొంగిలించాడని ఆరోపించడమే కాకుండా పంచాయితీ పెడతామని చెప్పడంతో మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు' పోలీసులు కేసు నమోదు చేశారు. దుకాణం యజమాని అవమానించడం వలనే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: