Womens Doing Free Service in Vemulawada Temple: భక్తి ఎక్కువగా ఉన్న మహిళలు మహా అయితే ఏం చేస్తారు... పండగలు, పబ్బాలప్పుడు ఆలయాలకు వెళుతుంటారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో గుడికి వెళ్లి తమ భక్తిని చాటుకుంటారు. కానీ.. ఈ మహిళలు మాత్రం ఒక అడుగు ముందుకేసి అంతకంటే ఎక్కువే చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఉచితంగా సేవలు చేస్తున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇలా వచ్చిన వారు దర్శనం అనంతరం కానుకలను నగదు, బంగారం, వెండి వస్తువుల రూపాల్లో హుండీల్లో వేస్తుంటారు. వీటిని ఆలయ అధికారులు 20 రోజులకు ఒకసారి, ఉత్సవాలు ముగిసిన సందర్భంలో అయితే 15 రోజులకొకసారి ఆదాయం లెక్కిస్తుంటారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు కొనసాగుతుంది.
ఇలా హుండీ ఆదాయం లెక్కిపు నుంచి మొదలు కొని రద్దీ సమయాల్లో భక్తులను క్యూలైన్లో సరిగ్గా నిలుచునేలా చూడటం, లడ్డూ ప్రసాదాల ప్యాకింగ్, అన్నదానం చేయడం వరకు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తమ సేవా భావాన్ని చాటుతున్నారు. ప్రధానంగా రాజన్నకు వచ్చే కానుకలు నగదు లెక్కించేందుకు వస్తున్నారు. రెండు రోజులు ముందు సమాచారం ఇస్తే చాలు.. వచ్చి ఆ పనిని పూర్తి చేసి వెళతారు.