వానరదండుపై యుద్ధానికి దిగిన గ్రామం...! ఏదైనా పంట వెయ్యాలంటే రైతులు జంకుతున్నారు. పెరట్లో కూరగాయల మొక్కలూ నాటేందుకు సందేహిస్తున్నారు. పండ్ల చెట్లున్నా... ఒక్కటి కూడా తినలేకపోతున్నారు. వడియాలు ఎండబెట్టుకోవాలన్నా జనాలు భయపడుతున్నారంటే రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ జనాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వానర దండు పెడుతున్న తిప్పలు అంతా ఇంతా కాదంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి గ్రామంపై మూకుమ్మడిగా దాడి చేసున్నాయి కోతులు. కొన్నిసార్లైతే ఇంట్లోకి దూరి జనాలను గాయపరుస్తున్నాయి కూడా...! బెడద తప్పించేందుకు విరాళాలు...
దండుగా వస్తున్న కోతులను ఎదుర్కొలేక... ఇటు పంటలు వేసుకోలేక... ఇళ్ల నుంచి బయటికొస్తే ఎక్కడ మీదపడి దాడిచేస్తాయోనని భయపడుతూ బతుకుతున్నారు స్థానికులు. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలని ఆలోచించిన గ్రామ సర్పంచ్... కోతులను పట్టే వారితో బేరం మాట్లాడేందుకు నిశ్చయించుకున్నాడు. దానికి కావాల్సిన నగదు కోసం విరాళాలు సేకరిస్తున్నారు. తన వంతుగా రూ.50 వేలు విరాళం అందించాడు. గ్రామస్థులు కూడా స్వచ్ఛందంగా ఇంటింటికీ రూ.350 ఇస్తున్నారు.
డబ్బులు పోయినా సరే... కోతుల బెడద తప్పించే మార్గం కావాలంటున్నారు గ్రామస్థులు. ఈ విధంగా అందరూ ఒక్కటై కోతుల మీద యుద్ధం ప్రకటించారు బొప్పాపూర్ ప్రజలు.
ఇవీ చూడండి: కోతులు బాబోయ్ కోతులు...!