వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రులు... అభివృద్ధి పనుల పురోగతిపై ఆరాతీశారు.
దేశమే అబ్బురపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు చెప్పిన మంత్రులు... వేములవాడనూ అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. స్థపతులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటే సమాంతరంగా పట్టణాభివృద్ధి జరగాలని... వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని స్పష్టం చేశారు.
పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్, కళా భవనం పనులను వేగవంతం చేయాలని... టెంపుల్ టూరిజంలో భాగంగా గుడి చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని, బోటింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు తెలిపారు. వేములవాడ, మధ్యమానేరులో పర్యాటక రంగాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని... తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.