తెలంగాణ

telangana

ETV Bharat / state

Tholi Ekadashi : తొలి ఏకాదశి వైభవం.. ఆలయాల్లో భక్తుల కోలాహలం - toli ekadashi festival in telangana

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో తొలి ఏకాదశి పర్వదినం వైభవంగా జరుగుతోంది. శ్రీమన్నారాయణుడి దివ్య దేహం నుంచి ఆవిష్కృతమైన సాత్విక రూపక శక్తి- ఏకాదశి తిథి. ఏడాది పొడుగునా ఉండే ఇరవైనాలుగు ఏకాదశుల్లో.. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది. ఈ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Tholi Ekadashi
తెలంగాణలో తొలి ఏకాదశి వైభవం

By

Published : Jul 20, 2021, 10:52 AM IST

Updated : Jul 20, 2021, 2:19 PM IST

తెలంగాణ వ్యాప్తంగా తొలి ఏకాదశి వైభవం విరాజిల్లుతోంది. ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే తరలివచ్చిన భక్తులతో కోవెలలన్ని కోలాహలంగా మారాయి. విష్ణు నామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి.

ఖమ్మంలో తొలి ఏకాదశి వైభవం

రాజన్న సన్నిధిలో ఏకాదశి వైభవం..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి, అనుబంధ పరివార దేవతలకు అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం మహాపూజ, అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

ఐనవోలులో ఏకాదశి..

వరంగల్​ పట్టణ జిల్లాలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐనవోలు మల్లికార్జున ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంభిక అమ్మవారిని శాకాంబరి(కూరగాయలతో అలంకరణ) అవతారంలో అలంకరించారు. ఈఏడు వర్షాలు సమృద్ధిగా కురవాలని ఒంటిమామిడిపల్లి గ్రామాల మహిళలు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. హన్మకొండలోని శ్రీదేవి-భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

యాదాద్రిలో ఏకాదశి వైభవం..

రాజన్న సన్నిధిలో ఏకాదశి వేడుకలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన జరిపారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కరోనా నిబంధనల మధ్య వారు స్వామి వారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మంథనిలో భక్తుల కిటకిట

తొలి ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి నదిలో స్నానమాచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. గోదావరి తీరంలోని గౌతమేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించారు. మంథనిలోని శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోతయడం వల్ల మంథనిలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంథని మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసులు ఎప్పటికప్పుడు గోదావరి పరిసరాలను శుభ్రం చేస్తూ భక్తులకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఖమ్మంలో భక్తుల కోలాహలం..

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తొలి ఏకాదశి పర్వదినం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. మధిరలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం, శ్రీకల్యాణ వెంకటేశ్వరాలయం, బంజారా కాలనీలోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరాలయం, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి.. మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా నిబంధనల మధ్య దర్శనాలు..

తొలి ఏకాదశిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనల ఉల్లంఘన జరగకుండా అన్ని ఆలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు మాస్కు ధరించి, శానిటైజర్ వాడేలా చర్యలు తీసుకున్నారు.

Last Updated : Jul 20, 2021, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details