కొవిడ్‌ను తట్టుకుని తిరిగి పూర్వస్థితికి రాగల సామర్థ్యం ఉన్న గ్రామంగా రాజన్నపేట ప్రాచుర్యం పొందుతోంది. విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి డాక్టర్ల బృందం సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం ఇప్పుడు కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి యథాస్థానంలో నిలబడే స్థాయికి చేరింది. ఇక ముందు ఎన్ని కరోనా దశలు వచ్చినా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న విశ్వాసం గ్రామప్రజల్లో కనిపిస్తోంది. మన కంటే ముందే అమెరికా కరోనా వల్ల గడ్డు పరిస్థితులను చవి చూసింది. అమెరికాలో కొవిడ్ చికిత్స, నిర్వహణలో తమ అనుభవాలు మాతృదేశానికి అందించాలని అక్కడ స్థిరపడిన 15మంది తెలుగు వైద్యులు, ఇతర ప్రాంతాల్లోని తమ మిత్రులతో కలిసి 'ప్రాజెక్ట్ మదద్'ను ప్రారంభించారు.
మే, జూన్, జులై మాసాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 1500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అధికారులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అమెరికా నుంచి 'జూమ్' ద్వారా వారంలో రెండుసార్లు వర్చువల్ విధానంలో కొవిడ్‌ను ఎదుర్కోవాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పది కంటే ఎక్కువ కేసులు బయటపడిన తెలంగాణలోని రాజన్నపేట గ్రామాన్ని కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.
ఐదంచెల వ్యూహంతో
కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు "ప్రాజెక్ట్ మదద్" అనేక ప్రయోగాలను చేసింది. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగించింది. చివరకు ఐదు అంచెల వ్యూహం అమలు చేసింది. అందులో భాగంగా గ్రామీణ వైద్య సహాయకుల్లో కరోనాపై అవగాహన, ఆత్మస్థైర్యం నింపడం, గ్రామస్థులకు కొవిడ్ ప్రోటోకాల్‌పై అవగాహన కల్పించడం, కొవిడ్‌పై నెలకొన్న అపోహలు, దుష్ప్రచారాలపై స్థానిక భాషలో సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, కొవిడ్ రోగుల పర్యవేక్షణ, సమాచారం ఒకే దగ్గర క్రోడీకరించే విధంగా డ్యాష్‌బోర్డు రూపలకల్పనతో పాటు అందరికీ టీకాల పంపిణీ చేపట్టారు.
కరోనా పట్ల విస్తృత ప్రచారం
గ్రామంలో పోస్టర్లను విరివిగా అంటించారు. కొవిడ్ రోగులకు దగ్గరలో చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, వాటిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్‌ల వివరాలు మదద్ మ్యాప్స్ రూపంలో అందించారు. కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ వివరాలు అన్నీ ఒకే చోట వైద్య శాఖకు అందుబాటులో ఉండేలా మదద్ కేర్ డాట్ కామ్ రూపంలో డాటా బేస్‌ను రూపొందించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకు రాలేని వారికి ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలను వేశారు. అల్మాస్‌పూర్, గొల్లపల్లి మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి రాపిడ్ టెస్టులను నిర్వహించాకే లోనికి అనుమతించారు.
గర్భిణులకు మినహా అందరికి టీకా