Police Caught Chain Snatchers in Karimnagar: దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు. కొట్టేయాలని ఒక్కసారి ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్ చేసిన వస్తువు మీదే ఉంటాయి. ఈ క్రమంలో వస్తువు ఓనర్ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ.. అచ్చం ఇలాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. చందుర్తి సీఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజున గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తు రూట్ మార్చారు.
ఈ క్రమంలోనే మల్కపేట గ్రామానికి చెందిన వృద్ధురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి స్నేహితుడికి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు. ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరల్లో ఉన్న సీసీ కెమెరాలను, సెల్ఫోన్ లొకేషన్ల ఆధారంగా వృద్ధురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ ద్విచక్ర వాహనం, ఇద్దరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.