Banyan tree: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట మండలం సుద్దాల గ్రామ శివారులో ఓ మర్రి చెట్టు ఉంది. మూడు నెలల క్రితం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆ చెట్టు కూకటి వేర్లతో సహా కూలిపోయింది. గ్రామానికి చెందిన బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ల వ్యవసాయ భూమిలో ఉన్న ఈ చెట్టు వయసు 70 ఏళ్లు. చెట్టు కూలిపోవడంతో వేర్లకు నీరు అందక కొద్ది రోజులకు మర్రి చెట్టు మోడుగా మారి చూపరులకు నిర్జీవంగా దర్శనమిచ్చింది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు.. డాక్టర్ దొబ్బల ప్రకాష్‌ను ఈ దృశ్యం కదిలించింది. మొన్నటి వరకూ ఠీవీగా నిలబడి ఎంతో మందికి నీడనిస్తూ, ప్రాణులు, పక్షులకు గూడుగా నిలిచిన మహా వృక్షం.. ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండటం చూసి కలత చెందారు. ఈ చెట్టుకు నీరందించి పునరుజ్జీవం చెందేలా చేయొచ్చని భావించారు.
చిగురించిన ఆశ(కు)లు
అనుకున్నదే తడవుగా ప్రకాశ్.. రైతులతో తన ఆలోచనను పంచుకున్నారు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి అక్కడి నుంచి మరో చోటికి తరలిస్తానని తెలిపారు. పక్క పొలంలోని బావి నీటిని వాడుకునేందుకు అనుమతి తీసుకున్నారు. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టుకు నీరందించారు. దీంతో ప్రకాష్ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఇది గమనించిన ప్రకాష్ నీరు పోయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితంగా ఎండిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇస్తోంది.