తెలంగాణలో భారీ స్వచ్ఛనీటి సమీకృత చేపలు, రొయ్యల పెంపక కేంద్రం(ఫ్రెష్‌వాటర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా హబ్(Mega Aqua Hub in Sircilla)) ఏర్పాటు కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద దేశంలోనే అతిపెద్దదైన హబ్(Mega Aqua Hub in Sircilla)ను 500 ఎకరాల్లో, భారీ పెట్టుబడులతో, 13వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భారీ పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు ప్రారంభమయ్యాక మరిన్ని సంస్థలు ఆక్వారంగంలో పెట్టుబడులకు ముందుకొస్తాయనేది ప్రభుత్వ అంచనా.
ఆహారశుద్ధి ప్రోత్సాహక ప్రాజెక్టు కింద పరిశ్రమలు, నీటిపారుదల, మత్య్సశాఖలు దీనిలో పాలు పంచుకోనున్నాయి. తెలంగాణలో ఆహారశుద్ధిని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వనరులను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. మధ్యమానేరు పొంగిపొర్లింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రైవేటు భాగస్వామ్యంతో భారీగా చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించాలని సర్కారు భావించింది. అనుభవమున్న మూడు సంస్థలు దీనిపై ఆసక్తి చూపాయి.
ఆధునిక విధానంలో..
విదేశాల్లో మాదిరి ఆధునిక విధానంలో చేపలు, రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు సంస్థలు అంగీకరించాయి. ఇందులో ఏడాది పొడవునా చేపలు, రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు 500 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం అందులో 300 ఎకరాలను చేపవిత్తనాల ఉత్పత్తి, శుద్ధి కేంద్రాలకు కేటాయించాలని భావిస్తోంది. ఆక్వా శిక్షణ కేంద్రాన్నీ స్థాపిస్తారు. మిగిలిన భూముల్లో సంస్థలకు అవసరమైన మేరకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రాజెక్టుకు మౌలిక వసతులనూ సర్కారే సమకూరుస్తుంది.