తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR SIRCILLA TOUR: సిరిసిల్లలో సీఎం.. ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ..​ - cm kcr sircilla tour

సీఎం కేసీఆర్​ తనయుడు కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో తొలిసారి.. నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న రెండు పడక గదుల ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, ఉపాధిమార్గాలను చూపే పలు సంస్థలను సీఎం జాతికి అంకితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా... పట్టణంలో పండుగ శోభ సంతరించుకుంది.

CM in Sircilla
సిరిసిల్లలో సీఎం

By

Published : Jul 4, 2021, 12:38 PM IST

Updated : Jul 4, 2021, 2:07 PM IST

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన తన ప్రత్యేక బస్సులో సిరిసిల్లకు చేరారు. తెరాస శ్రేణులు, అధికారులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 4 గంటల వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.

ముందుగా తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి పట్టువస్త్రాలు అందజేసి.. మిఠాయిలు తినిపించారు. అనంతరం వారిని సీఎం ఆశీర్వదించారు. దాదాపు 30ఎకరాల స్థలంలో.. రూ.83కోట్లతో రెండు పడక గదుల ఇళ్లను తీర్చిదిద్దారు. మొత్తం 1,320 ఇళ్లను నిర్మించారు.

సీఎం వెంట మంత్రులు..

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

ఐడీటీఆర్ సెంటర్ ప్రారంభం

అనంతరం.. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చ్ కేంద్రం ప్రారంభించారు. రూ.16.48 కోట్లతో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో ఐడీటీఆర్ ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన ఈ కేంద్రంలో... 180 మందికి వసతితో కూడిన శిక్షణ తీసుకునే సదుపాయాన్ని కల్పించారు.

అధునాతన హంగులతో నర్సింగ్ కళాశాల..

అక్కడి నుంచి సిరిసిల్లలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్లతో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల వద్దకు సీఎం చేరుకున్నారు. కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అధునాతన హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు.

సర్దాపూర్ మార్కెట్ యార్డ్

సర్దాపూర్‌లో రూ.20 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించిన సిరిసిల్ల మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఈ ఆధునిక వ్యవసాయ మార్కెట్‌ రాష్ట్రానికే తలమానికంగా మారనుంది.

సమీకృత కలెక్టరేట్​ ప్రారంభం..

అనంతరం.. రగుడు వద్ద సకల సౌకర్యాలతో నిర్మించిన సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. 93.33 ఎకరాల్లో రూ.64.70 కోట్లతో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. రెండతస్తులు 4 బ్లాకుల్లో అన్ని ప్రభుత్వ విభాగాలకు ఒకే గొడుగు కింద పనిచేసేలా... సకల వసతులతో అందుబాటులోకి రానుంది. కలెక్టరేట్​లోని పలు విభాగాల సిబ్బందితో సీఎం ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళ ఉద్యోగులు, నర్సులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వాళ్లు చెప్పిన సమస్యలను విన్న ముఖ్యమంత్రి... వాటిని పరిష్కరించేలా వెంట ఉన్న అధికారులకు సూచనలు చేశారు.

సర్వాంగ సుందరం

సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీసు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రాకకై.. సిరిసిల్ల జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణమంతా గులాబీమయంగా మారింది. అడుగడుగునా స్వాగత తోరణాలతో సరికొత్త శోభను సంతరించుకుంది.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల అనంతరం, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సుదీర్ఘ కాలం తర్వాత జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి... తమ ప్రాంతానికి వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. సిరిసిల్ల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

Last Updated : Jul 4, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details