హైలెవల్ వంతెన ఉన్నా... వాగులో నుంచే ప్రయాణం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్లే రహదారిలో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బిక్కవాగులో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనలో పరామర్శకు వచ్చిన అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత సీఎం కేసీఆర్... వాగుపై హైలెవల్ వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. విడుదలైన నిధులతో వంతెన నిర్మించినా... అప్రోచ్‌రోడ్లు మాత్రం ఇంకా పూర్తికాలేదు.
ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఈ రహదారే కీలకం. ఇల్లంతకుంట నుంచి అనంతారం, పెద్దలింగాపూర్, చిన్నలింగాపూర్, జిల్లెల వైపు ప్రజలకు ఈ మార్గమే దిక్కు. అనంతారం రిజర్వాయర్ నుంచి లీక్ అవుతున్న నీటితో వాగులో ప్రవాహం కొనసాగుతోంది. గత్యంతరం లేక ప్రజలు ఆ నీటిలో నుంచే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై వచ్చినప్పుడు ఇసుకలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వాహనదారులు.
ప్రవాహం పెరిగినప్పుడు ఈ రహదారిని వదిలి రహీంఖాన్ పేట మీదుగా వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన పూర్తి చేయాలని నాలుగేళ్లుగా ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. స్థానిక నేతల వాహనాలకూ ఇబ్బందులు ఎదురైనా... వంతెన పూర్తి చేసేందుకు పూనుకోవాట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు