Sri Rama Navami at Vemulawada Temple: కేవలం వైష్ణవ ఆలయాల్లోనే కాదు... శైవక్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. ఇందుకు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయమే నిదర్శనం. సీతారాముల కల్యాణానికి పురపాలక సంఘం కమిషనర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం శ్రీరాజరాజేశ్వరుడికి సుప్రభాతం, ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాజేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీలక్ష్మీగణపతికి అభిషేకం, శ్రీరాజరాజేశ్వరీ దేవికి శ్రీసూక్త దుర్గాసూక్త లలితాసహస్త్ర అష్టోత్తర నామార్చన, రామాలయంలో శ్రీసీతారామ చంద్రమూర్తి స్వామివార్లకు పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు, మూలవిరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఎదుర్కోళ్ల కార్యక్రమంతో కల్యాణ వేదికకు శ్రీసీతారాముల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువును నిర్వహించారు.
హరిహరక్షేత్రంగా:ప్రధాన ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడు అనంత పద్మనాభస్వామి, శ్రీసీతారామ చంద్రమూర్తి ఆలయాలు కొలువై ఉండటంతో హరిహరక్షేత్రంగా విరాజిల్లుతోంది. వేములవాడ ఆలయంలో శివుడు, రాముడికి సమానంగా పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఇక్కడ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే రామకల్యాణంలో శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు శివుడిని పెళ్లాడటం విశేషం. వేములవాడలో రామ కల్యాణమంటేనే హిజ్రాల సందడి మొదలవుతుంది.