అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం - marriage
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున అర్చకులు స్వామివారి కల్యాణం జరిపించారు.
తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దత్తత దేవాలయమైన నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం పంచొపనిషత్ అభిషేకం జరిగిన అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీ దేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను గుట్ట కింది భాగాన ఎదురుకోళ్ల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రంగు రంగు పూలతో అలంకరించిన పెళ్లి పందిరిలో అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఘట్టాన్ని చూసి తిలకించారు. ఈ బ్రహ్మోత్సవాలు శనివారం పూర్ణాహుతి, బలిహరణతో ముగుస్తాయని అర్చకులు తెలిపారు.