తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 2:29 PM IST

ETV Bharat / state

గృహమే విద్యాలయం.. చరవాణే పుస్తకం..

కరోనా వైరస్‌ వ్యాప్తి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చిలో మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా ఉపాధ్యాయులను మాత్రమే విధులకు హాజరవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థుల అభ్యాసన కుంటుపడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సాధనాల వినియోగం.. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై దృష్టి సారించింది. తరగతుల వారీగా బోధన పాఠ్యాంశాల ఎంపిక.. విద్యా సంవత్సర ప్రత్యామ్నాయ కాలమాణిని అమలులోకి తీసుకొచ్చేలా జిల్లా విద్యాశాఖ సంసిద్ధమవుతోంది.

SPECIAL STORY ON ONLINE CLASSES PROBLEMS IN SIRICILLA DISTRICT
గృహమే విద్యాలయం.. చరవాణే పుస్తకం..

జూన్‌ నెలలో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు కొవిడ్‌ విజృంభనతో అయిదు నెలలు ఆలస్యమైంది. సెప్టెంబరు 1 నుంచి సాంకేతిక ఉపకరణాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయులు బోధన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దూరదర్శన్‌, టీ-శాట్‌ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆన్‌లైన్‌లో విద్యార్థుల ప్రవేశాలు చేపడుతోంది.

వసతులపై దృష్టి

విద్యార్థులకు రోజూ పాఠ్యాంశాల బోధన సమయంలో ఏదో ఒక సాంకేతిక ఉపకరణాలు అందుబాటులో ఉంచేలా తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నారు. దీని కోసం ముందుగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి పాఠశాల స్థాయిలో ప్రణాళికను రూపొందిస్తున్నారు. పాఠ్యాంశాల బోధన, సమయ పట్టికను విద్యార్థులకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బోధన సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగకుండా జిల్లాలో సెస్‌ అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోలేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు.. పూర్వ విద్యార్థుల సహకారంతో ఆన్‌లైన్‌ పాఠాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

సాంకేతిక ఆధారంగా ప్రవేశాలు

జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రవేశాలకు అనుమతినిచ్చింది. ప్రధానోపాధ్యాయులు సాంకేతికను సద్వినియోగం చేసుకుంటున్నారు. సిరిసిల్ల బాలుర పాఠశాలలో ఆన్‌లైన్‌ ప్రవేశాలను అమలులోకి తీసుకువచ్చారు. పాఠశాల ఈ మెయిల్‌కు విద్యార్థులు గూగుల్‌ ఫాంలో వివరాలు నింపి పంపుతున్నారు. ఇదే దారిలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట కేజీబీవీలు అనుసరిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నేరుగా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలు పొందుతున్నారు.

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ బోధన ప్రారంభమవుతుంది. పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నాం. ఆన్‌లైన్‌ బోధనకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఇప్పటికే నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించాం.- రాధాకిషన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

ఇది చూడండి క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details