Siricilla Handloom worker: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరమగ్గాలపై రకరకాల కళాఖండాలు నేస్తూ.. అందరినీ అబ్బురపరుస్తున్నాడు. గతంలో.. అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నాన్ని తయారుచేయటమే కాకుండా.. అగ్గిపెట్టెలో పట్టే అంగీ, లుంగీతో పాటు ఉంగరం, దబ్బనంలో దూరే చీరలను నేసి హరిప్రసాద్ తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు. కాగా.. ఇప్పుడు చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర సర్కార్ నేతన్నకు జీవిత బీమా పథకాన్ని అతి త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో.. హరిప్రసాద్ తన కళ ద్వారా స్వాగతించాడు.
మరమగ్గం సాయంతో తనకు తెలిసిన కళతో.. చీరపై నేతన్నకు బీమా పథక వివరాలను నేసి మరోసారి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. చీరపై మగ్గం నేస్తున్న నేతన్న బొమ్మతో పాటు పథకానికి సంబంధించిన వివరాలను హరిప్రసాద్ స్పష్టంగా నేశాడు. పథక విశేషాలతో పాటు.. ఒక పక్కన సీఎం కేసీఆర్, మరో పక్కన మంత్రి కేటీఆర్ చిత్ర పటాలను కూడా నేసి.. వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కళాఖండాన్ని ఆవిష్కరించేందుకు తనకు నాలుగురోజులు సమయం పట్టినట్టు హరిప్రసాద్ చెబుతున్నాడు. పథకానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను తలపిస్తోన్న ఆ కళాఖండాన్ని అందంగా మరమగ్గంపై నేసి అందరి చేత నేత మన్ననలు అందుకుంటున్న హరిప్రసాద్.. అవకాశమిస్తే సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్‌కు బహూకరిస్తానని ఆశపడుతున్నాడు.