తెలంగాణ

telangana

ETV Bharat / state

వస్త్రానికి కరవైన రక్షణ.. ఆర్డర్లున్నాయ్​ కానీ భద్రతే లేదు.. - telangana news

రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి ఏటా కోట్ల విలువైన ఆర్డర్లు కేటాయిస్తోంది. కానీ ఉత్పత్తి చేసిన వస్త్రాలను భద్రపరచడానికి సరైన స్థలం కరవైంది. ఈ విషయాలపై మంత్రి కేటీఆర్‌ దృష్టిసారించాలని ఇక్కడి పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి

వస్త్రానికి కరువైన రక్షణ.. ఆర్డర్లున్నాయ్​ కానీ భద్రతే లేదు..
వస్త్రానికి కరువైన రక్షణ.. ఆర్డర్లున్నాయ్​ కానీ భద్రతే లేదు..

By

Published : Feb 21, 2022, 11:13 AM IST

Updated : Feb 21, 2022, 11:46 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 68 వేల మరమగ్గాలుంటే వాటిలో సిరిసిల్లలోనే 36 వేలున్నాయి. ఇక్కడి వస్త్ర పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆరేళ్లుగా రూ.కోట్ల విలువైన ఆర్డర్లు కేటాయిస్తోంది. కానీ ఉత్పత్తి చేసిన వస్త్రాలను భద్రపరచడానికి సరైన స్థలం కరవైంది. జిల్లాలో తమకు గోదాములు అవసరమనే ప్రతిపాదనలేవీ తెలంగాణ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ (టెస్కో)నుంచి ప్రభుత్వానికి ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


రాష్ట్ర చేనేత, జౌళిశాఖ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏటా ఆర్వీఎం, సంక్షేమశాఖ, బతుకమ్మ, కేసీఆర్‌ కిట్‌, రంజాన్‌, క్రిస్మస్‌లకు చెందిన సుమారు 9 కోట్ల మీటర్లు కేటాయిస్తోంది. వీటి విలువ దాదాపు రూ.400 కోట్లపైనే ఉంటుంది. ఈ ఆర్డర్లను 136 మ్యాక్స్‌ (మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ)లు, 135 ఎస్‌ఎస్‌ఐ (చిన్న తరహా పరిశ్రమలు)లకు ఇస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని టెస్కో సేకరించి.. నాణ్యత పరీక్షలను సిరిసిల్లలోని మార్కెట్‌ కమిటీలో చేస్తోంది. వస్త్రంలో ఎలాంటి లోపాలు లేవని తేలాక.. ప్రాసెసింగ్‌, సైజింగ్‌, ప్యాకింగ్‌కు హైదరాబాద్‌లోని పరిశ్రమలకు పంపుతారు. ఇలా రోజుకు లక్షల మీటర్ల వస్త్రం ఇక్కడికి వస్తుంది. సెలవు రోజుల్లో ఈ నిల్వలు భారీగా పేరుకుపోతాయి. ఒకే సారి వీటన్నింటిని పరిశీలించి.. పంపే వీలుండదు. ప్రస్తుతం టెస్కో సేకరించిన 1.06 కోట్ల మీటర్ల బతుకమ్మ చీరలను మార్కెట్‌యార్డు గోదాముతో పాటు పట్టణంలోని కల్యాణమండపం, మూతబడిన కార్ఖానాలో తాత్కాలికంగా నిల్వ ఉంచారు. వీటిని జూన్‌ వరకు ఇక్కడే భద్రపరచాల్సి ఉంది.

అనుకోనిది జరిగితే?

ఈ ఏడాది ఆర్వీఎం, సంక్షేమశాఖ, బతుకమ్మ చీరల ఆర్డర్లు మరో నెలరోజుల్లో కేటాయించనున్నారు. వీటి ఉత్పత్తి ప్రారంభమైతే ఇక వాటి నిల్వలకు చోటులేదు. మార్చి, ఏప్రిల్‌లో యాసంగి పంట ఉత్పత్తులు విక్రయానికి వస్తే ఇబ్బందులు తప్పవు. మార్కెట్‌ కమిటీ గోదాం లోపల స్థలం సరిపోక పోవడంతో బయట ఉన్న షెడ్డులో వస్త్రాలను నిల్వ చేశారు. వీటిపై చిరిగిన టార్పాలిన్లను అరకొరగా కప్పి ఉంచారు. ఎండకు ఎండుతూ.. వర్షాలకు తడుస్తుండటంతో లక్షల మీటర్ల వస్త్రం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. జిల్లాకు విడతల వారీగా కేటాయించే వస్త్రోత్పత్తుల సేకరణకు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాం సరిపోతుందని అంచనా. దీంతో పాటు 20 మంది సిబ్బంది నాణ్యత పరీక్షలు నిర్వహించేలా వెలుతురుతో విశాలమైన షెడ్లు, కార్యాలయం అవసరం. ఈ విషయాలపై మంత్రి కేటీఆర్‌ దృష్టిసారించాలని ఇక్కడి పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

బీమా ప్రతిపాదనలు పంపాం

గతేడాది చీరలతోనే నిల్వలు పేరుకుపోయాయి. అయిదు నెలలపాటు వస్త్ర నిల్వలకు రూ.20 కోట్లకు ప్రమాద బీమా చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వీటిని రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపాం. వస్త్రాలు నిల్వచేసిన చోట కాపలాకు సిబ్బందిని ఏర్పాటు చేశాం.

- సాగర్‌, ఏడీ చేనేత, జౌళిశాఖ

ఇదీ చదవండి:

Last Updated : Feb 21, 2022, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details