తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE Video: కార్యాలయం జలమయం.. ఉద్యోగులతో కలిసి ఆ కలెక్టర్ బయటకెలా వచ్చారంటే?

సిరిసిల్లలో కురుస్తున్న భారీ వర్షాలతో సమీకృత నూతన కలెక్టరేట్ జలదిగ్బంధమైంది. కలెక్టరేట్ చూట్టూ నీరు చేరడంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. నిలిచిన నీటితో కలెక్టరేట్‌లోకి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సిబ్బందితో కలిసి బయటకు వచ్చేందుకు కలెక్టర్​.. చాకచక్యంగా వ్యవహరించారు. సిబ్బందితో కలిసి ముంపును ఎలా దాటారంటే..?

siricilla collector came out form office on a tractor  with employees
siricilla collector came out form office on a tractor with employees

By

Published : Sep 28, 2021, 4:06 PM IST

కార్యాలయం జలమయం.. ఉద్యోగులతో కలిసి ఆ కలెక్టర్ బయటకెలా వచ్చారంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సిరిసిల్ల- కరీంనగర్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద ఉద్ధృతి కొనసాగడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువనున్న బోనాల పెద్ద చెరువు పొంగి పొర్లడం వల్ల పట్టణంలోని వెంకంపేట, అంబికానగర్, అశోక్ నగర్, సంజీవయ్య నగర్, శాంతి నగర్, అంబేడ్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరద నీటికి కలెక్టర్​ కార్యాలయం జలదిగ్బంధమైంది.

ప్రతిసారి సేమ్​ సీన్​..

ఎప్పుడు వర్షం గట్టిగా కురిసినా... సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయం చెరువును తలపిస్తోంది. కొత్తచెరువు మత్తడి దూకడంతో పాటు శాంతినగర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా కలెక్టరేట్ సముదాయం వైపు వచ్చి జలమయమవుతోంది. కలెక్టర్ క్యాంపు కార్యాలయం కూడా సమీకృత కార్యాలయాల సముదాయంలోనే ఉండటం వల్ల.. కలెక్టర్ అనురాగ్​ జయంతి బయటికి రావడం ఇబ్బందిగా మారింది. ముచ్చటగా మూడోసారి కార్యాలయం నీట మునిగింది.

ట్రాక్టర్​ సాయంతో...

వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనాలు బయటకు వెళ్లలేకపోవటమే కాక.. బయటివి కూడా లోపలికి రాలేనంతగా నీళ్లు నిలిచిపోయాయి. ఓ వైపు వరద నీటితో జలమయమైన పట్టణ పరిస్థితిని పరిశీలించేందుకు కలెక్టర్​ వెళ్లాల్సిన సమయం. మరోవైపు ఆయనే ముంపులో ఇరుక్కున్న సందర్భం. బయటికి వెళ్లేందుకు కలెక్టర్​కు పెద్ద సవాలే ఎదురైంది. కలెక్టర్ అనురాగ్‌ జయంతి ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. పట్టణంలోనికి వెళ్లేందుకు చివరికి ఓ ట్రాక్టర్​ సాయం తీసుకున్నారు.

చర్చనీయాంశంమైన ట్రాక్టర్​ ప్రయాణం..

సిబ్బందితో కలిసి కలెక్టర్... ట్రాక్టర్​ ఎక్కారు. ముంపును దాటుకుని.. కార్యాలయం నుంచి పట్టణంలోకి వచ్చారు. పట్టణంలో ఎక్కడెక్కడ నీరు నిలువ ఉన్నాయో ప్రత్యక్షంగా పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ తిరిగి అదే ట్రాక్టర్​పై కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details