రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కరోనా కట్టడి చర్యలతో పాటు.. దోమల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల చర్యలకు తోడుగా ప్రజల నుంచి చైతన్యం అవసరం. వర్షాకాలం దోమల వ్యాప్తి పెరుగుతుంది. జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో తక్షణ కార్యాచరణ అమలు చేయాలి. ఈ నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులను తరిమికొట్టాలంటే..పరిశుభ్రత ఒక్కటే మార్గం. ఈ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
మంత్రి కె.తారకరామారావు వారంలో ఒకరోజు ఎవరికి వారు తమ గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మంత్రి పిలుపుతో జిల్లా ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాటిస్తున్నారు. ఇదే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.
వ్యాధి కారకాలను అరికట్టాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతేడాది 13 మంది డెంగీ బారినపడ్డారు. వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో జూన్ నుంచి సెప్టెంబరులో 593 మంది విషజ్వరాల బారినపడ్డారు. అప్పట్లో దోమల వ్యాప్తిని అరికట్టడంతో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలొచ్చాయి. కరోనా మహమ్మారికి డెంగీ, మలేరియా జ్వరాలు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనాతోపాటు కాలానుగుణ వ్యాధుల్లోనూ కొన్ని ప్రాథమిక లక్షణాల్లో సారూప్యత ఉంటుంది. జ్వరం, జలుబు, గొంతు, ఒళ్లు, కీళ్ల నొప్పుల వంటివి ఉన్నాయి. వర్షాలకు చల్లబడే వాతావరణంలో సాధారణ ప్లూ జ్వరాలు వంటి కేసుల నమోదు ఎక్కువే. కాలానుగుణ వ్యాధి లక్షణాలతో వచ్చే రోగుల్లో కరోనా బాధితులకు గుర్తించడం వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగానికి క్లిష్టమే.
ప్రణాళిక ముఖ్యం
ఏటా వర్షాకాలం వ్యాధుల సీజన్‌గా మారుతోంది. దీనికి పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆయా శాఖలు సమన్వయంతో వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యాధి కారకాలను తొలగించేలా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిని ప్రతీ పౌరుడు అనుసరించాల్సిన అవసరం ఉంది.