తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న లడ్డూ టికెట్లలో అవకతవకలు - rajanna temple latest news

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న ఆలయంలో తరచుగా అవినీతి బయట పడుతూనే ఉంది. ఏదో రకంగా అవకతవకలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా లడ్డూ ప్రసాదాల వ్యవహారంలో టికెట్లలో తేడాలు రావడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా టికెట్లకు, అందిన డబ్బులకూ లెక్కలు కుదరడం లేదు. తక్కువగా వచ్చిన మొత్తాన్ని సిబ్బంది తమ జేబులోంచి చెల్లిస్తున్నారు. ఎందుకు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.

rajanna temple prasadam ticket dispute
రాజన్న లడ్డూ టికెట్లలో అవకతవకలు

By

Published : Dec 14, 2020, 10:48 PM IST

లడ్డూ ప్రసాదాల వ్యవహారంలో టికెట్లలో తేడాలు రావడం వేములవాడ రాజన్న ఆలయంలో చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో అధిక ఆదాయం ప్రసాదాల విభాగం నుంచి సమకూరుతుంది. ప్రసాదాల కౌంటర్​కు ఆలయ స్టేషనరీ విభాగం నుంచి టికెట్ల పుస్తకాలను పొందుతారు. ఒక్కో పుస్తకంలో 1000 టికెట్లు ఉంటాయి. దాని ప్రకారం సిబ్బంది డబ్బులు చెల్లిస్తారు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా టికెట్లకు, అందిన డబ్బులు లెక్కలు కుదరడం లేదు. తక్కువగా వచ్చిన మొత్తాన్ని తమ జేబులోంచి చెల్లిస్తున్నారు. అనుమానం వచ్చిన సిబ్బంది టికెట్ పుస్తకంలో టికెట్లను లెక్కించగా, వరుస క్రమంలో తేడాలు గమనించారు. ఒక్కో పుస్తకంలో 15-20 టికెట్లు తక్కువగా ఉంటున్నాయి.

* ప్రింటింగ్ మాయాజాలం..

రాజన్న ఆలయ ప్రసాదాలకు చాలా డిమాండ్ ఉంటుంది. పెద్ద మొత్తంలో భక్తులు కొనుగోలు చేసి తమ స్వస్థలాల్లో పంపిణీ చేయడం ఆనవాయితీగా ఉంది. ఆలయంలో లడ్డూలు, అభిషేకం లడ్డూలు, బెల్లం లడ్డూలు, పులిహోరాలు భక్తులకు విక్రయిస్తున్నారు. పరిసరాల్లోని గోదాంలో ప్రసాదాలను తయారు చేసి విక్రయ కేంద్రాల్లో అమ్ముతుంటారు. 100 గ్రాముల లడ్డూ అమ్మకాలకు సంబంధించిన పుస్తకంలో నంబర్ల మాయ చేస్తున్నారు. ఆలయంలో గత ఫిభ్రవరి దాకా ఈ-టికెట్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. నేరుగా కౌంటర్లోనే టికెట్ ప్రింటవుతుండేది. ఈ-టికెట్ గుత్తేదారుల సమయం ముగిసిపోవడంతో టికెట్లను ప్రింట్ చేయిస్తున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో టికెట్ల ప్రింటింగ్ కొనసాగుతుంది. ఒక్కో బుక్ లో 1 నుంచి 1000 వరకు వరుసక్రమంలో నంబర్లతో టికెట్లు ఉంటాయి. నెల రోజులుగా సిబ్బందికి తక్కువగా డబ్బులు అందుతున్నా తమలో లోపంతోనే నష్టపోతున్నామని మిన్నకుండిపోయారు. రూ.20 టికెట్ల పుస్తకాల్లో టికెట్లపై వరస క్రమంలో తేడాలను గమనించారు. సంవత్సరం క్రితం ఓ ఉద్యోగి లెక్కల్లో రూ. 60 వేలు తేడా రావడంతో డబ్బులు చెల్లించాలని అధికారులు ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పటివరకు టికెట్ కౌంటర్​లో పనిచేసే సిబ్బంది లక్షల్లో తేడాలు వచ్చినా ఎందుకు ఓర్చుకున్నారో అర్ధం కావడం లేదు.

టికెట్ల వ్యవహారంలో నిత్యం అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రసాదాల అమ్మకాల్లోనూ టికెట్ రీసేల్ జరుగుతుందనే ప్రచారం కూడా ఉంది. అందులో అందే డబ్బులతోనే లోటును పూడ్చుకుంటున్నారని విమర్శలున్నాయి. ప్రింటింగ్ నుంచి వచ్చిన టికెట్లను ఆలయ ఆధికారులు పరీక్షించి, వాటిపై రౌండిల్ వేస్తారు. ఈ క్రమంలోనే తప్పులుంటే పట్టుకుంటారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో... ఎవరి హస్తం ఉందో.. ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం సాగుతుందో.. తేలాల్సి ఉంది. జైళ్ల శాఖలో ప్రింటింగ్​లోనే తప్పులున్నాయా అనే విషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశముంటుంది.

పూర్తి స్థాయిలో విచారణ:

రాజన్న ఆలయ ప్రసాద కౌంటర్లలో టికెట్లలో తేడాలు వస్తున్నాయి. టికెట్లకు కేటాయించే వరుస క్రమంలో నంబర్లు మిస్ అవుతున్నాయి. సమస్య మా దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నాం. జైళ్ల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. ఆలయంలో ఈ టికెట్ల కోసం కమిషనర్​కు నివేదిక సమర్పించాం.

-డి.కృష్ణప్రసాద్, రాజన్న ఆలయం ఈఓ

ఇదీ చూడండి:యుద్ధ ప్రాతిపదికన టీ-ఫైబర్ ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details