రాజన్న సిరిసిల్లలోని రగుడు నుంచి మల్కపేట జలాశయం వరకు (malkapeta pump house) లీకేజ్ నీటి ఎత్తిపోత పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం (kaleswaram project) 9వ ప్యాకేజీ సొరంగం, పంపుహౌస్‌లో నీటిని తోడుతున్నా సీపేజీ (లీకేజ్ నీరు) తగ్గడం లేదు. చెన్నైకి చెందిన సంస్థ ద్వారా ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు సెప్టెంబరు 14న ప్రత్యేకంగా మోటార్లు తెప్పించారు. వాస్తవానికి పది రోజుల్లో నీరు ఖాళీ చేయాల్సి ఉంది. గత సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు సొరంగ మార్గం, పంపుహౌస్‌లో సీపేజీ పెరిగింది. ఎంత తోడినా.. నీరు తరగడం లేదు. రగుడు నుంచి మల్కపేట వరకు సొరంగ మార్గం పైభాగంలోని చెరువులు, కుంటల్లోకి వరద పోటెత్తింది. ఈ నీటి ప్రవాహం అదుపులోకి వస్తేగానీ సొరంగంలోకి సీపేజీ తగ్గదు. ప్రవాహం తగ్గిన తరవాతే సొరంగంలో సిమెంటు లైనింగ్ పూర్తి చేసి.. పంపుహౌస్‌లో మోటార్లు బిగింపు ప్రక్రియను ప్రారంభించొచ్చు. గత 24 రోజులుగా పనులు చేస్తున్నా.. సామగ్రి మొత్తం నీటిలోనే ఉండిపోయింది. మరోవైపు డిసెంబరు నాటికి మల్కపేట జలాశయంలోకి ట్రయల్ రన్ చేసే ప్రణాళికతో అధికారులు ఉన్నారు.
అప్రోచ్ కాల్వకు గండి కొట్టి...
ఎగువ నుంచి వస్తున్న వరదతో రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం వెనక జలాలు కరకట్టను దాటి సిరిసిల్ల పట్టణానికి చేరువగా వచ్చాయి. సిరిసిల్ల నుంచి వస్తున్న వరదను మానేరు వాగులోకి మళ్లించేందుకు అధికారులు 9వ ప్యాకేజీ అప్రోచ్ కాల్వ కట్టకు గండి కొట్టారు. హెడ్ రెగ్యులేటర్ల సమీపంలోని కొత్తకుంటకు గండి పడటంతో వరద నీరు కరకట్ట సమీపంలోకి చేరుతోంది. ఈ ప్రక్రియ 15 రోజులుగా కొనసాగుతున్నా నీరు తగ్గడంలేదు. మరోవైపు సొరంగంలోకి జలాలు చేరకుండా కట్టకు ఇరువైపులా రాతితెట్టును నిర్మిస్తున్నారు. నీటిని తోడే ప్రక్రియ పూర్తయితేనే సొరంగం, పంపుహౌస్‌లో ఎంతమేరకు సామగ్రి ఉంది, విడిభాగాలకు నష్టం జరిగిందా అన్న వివరాలు తెలుస్తాయి. అప్పటి వరకు ఏమీ చెప్పలేమని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.