తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్పంచ్ మా భూములను వేరే వాళ్లకి ఇచ్చారు.. న్యాయం చేయండి'

Farmers protest for Jillela land issue : ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూమిని... సర్పంచ్ కావాలనే వేరే వాళ్లకు ఇప్పించారని రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల రైతులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినందుకు కుల బహిష్కరణ చేశారని వాపోయారు. మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్లడం కోసం హైదరాబాద్​లో ఆందోళనకు దిగారు.

Farmers protest for Jillela land issue, farmers strike
జిల్లెల దళిత రైతుల ఆందోళన

By

Published : Feb 15, 2022, 4:29 PM IST

Farmers protest for Jillela land issue: రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత రైతులు హైదరాబాద్​లో ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు బాధిత రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామ శివారు సర్వే నంబర్ 671, 672 గల ప్రభుత్వ భూమిలో గత 60ఏళ్లుగా మూడు కుటుంబాలు సాగు చేసుకుంటున్నట్లు బాధిత రైతులు తెలిపారు. జిల్లెల్ల గ్రామ అధికార పార్టీ సర్పంచ్ మాట్ల మధు... తమకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని అగ్రకులాలకు (ఓసీ), ప్రభుత్వ భూమిని అమ్ముకున్న వారికే దౌర్జన్యంగా కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ భూమి కోసం సర్పంచ్​ను ప్రశ్నిస్తే కుల బహిష్కరణ, పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నప్పటికీ... తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూమిని అగ్రకులాలకు అప్పజెప్తున్న సర్పంచ్​పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని... చాలాసార్లు కలవడానికి వెళ్తే అడ్డుకుంటున్నారని తెలిపారు. అందుకే హైదరాబాద్ వచ్చి నిరసన తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్పందించి న్యాయం చేసి... తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న సర్పంచ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సర్వే నంబర్ 671, 672లో మా భూమి ఉంది. మేం సాగు చేసుకుంటున్నాం. మావి మూడు కుటుంబాలు. 690 సర్వే నంబర్​లో ప్రభుత్వ భూమి ఉండగా... కావాలనే ఓసీ, బీసీలకు అధికార పార్టీకి చెందిన మా గ్రామ సర్పంచ్ మాట్ల మధు భూమి ఇప్పించారు. ప్రభుత్వ భూమి అమ్ముకున్నవారికి ఇప్పించారు. మేం ప్రశ్నిస్తే కుల బహిష్కరణ చేశారు. మంత్రి కేటీఆర్​ను కలుద్దామని పోతుంటే.. కలవనివ్వడం లేదు.

-బాధిత దళిత రైతులు

భూములు కోల్పోయామని మంత్రి కేటీఆర్​కు తెలియజేయడం కోసం హైదరాబాద్​లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్నాం. మా భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి దగ్గరికి తీసుకెళ్లనీయకుండా చూస్తున్నారు. కలెక్టరేట్​కు వెళ్తే.. బయటకు పంపిస్తున్నారు. మా సర్పంచ్ మా భూమిని వేరే వాళ్లకు ఇస్తున్నారు. అరవై, డెబ్బై ఏళ్ల నుంచి మేమే సాగు చేసుకుంటున్నాం. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

-బాధిత దళిత రైతులు

ఇదీ చదవండి:YS Sharmila Arrest: వైఎస్ షర్మిల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details