రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో పోడు భూముల సమస్య మళ్లీ రాజుకుంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని స్థానిక దళిత రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగి.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్రామంలోని దాదాపు వందకు పైగా దళిత కుటుంబాలు సుమారు 80 ఎకరాల పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో హరితహారం పనులు చేపట్టేందుకు రాగా.. దళిత రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య వివాదం జరిగింది. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు హరితహారం పనులు తాత్కాలికంగా నిలివేస్తున్నామని ప్రకటించారు.