రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పది, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్షల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ మూల్యాంకనం ప్రారంభమైంది. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తెలుగు పేపర్-1, పేపర్-2, హిందీ పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు వైరస్ బారిన పడకుండా తీసుకునే చర్యలు.. నిర్వహణ విధానంపై తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది.
అదనపు పరీక్షా కేంద్రాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాల్లో 6,462 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రస్తుతం భౌతిక దూరం పాటించాలనే నిబంధనతో వీటి సంఖ్య 67కు చేరే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రాల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత, కొన్ని ప్రైవేటు పాఠశాలలను గుర్తించారు.
డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో జరగాలి. లాక్‌డౌన్‌తో పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. జిల్లాలో 19 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 5,834 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 తర్వాత నిర్వహించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించడంతో పాటు ప్రశ్నపత్రంలో ప్రతి విభాగంలోనూ చాయిస్‌గా ప్రశ్నలు ఇవ్వనున్నట్లు సమాచారం.