ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారులు అందరూ స్థానికంగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గర్లో గల గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రిస్క్యూ చేసే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించేలా ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.