రైతులు ఒకచోట చేరి సాగు విధానాలు, ఇతర అంశాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాటి నిర్మాణాల్లో వేగం పెరగడం లేదు. జిల్లాలోని 13 మండలాల్లో 57 రైతు వేదికలు నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి కొన్ని గ్రామాల్లో పనులను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తమ సొంత ఖర్చులతో 14 వేదికలను నిర్మించడానికి ముందుకు వచ్చారు. అందులో ఇప్పటికే తంగళ్లపల్లి, వీర్నపల్లి, బోయినపల్లి మండలాల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా భవనాల పనులు మొదలైనప్పటికీ 54 వేదికల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు, బోయినపల్లిలో ఒకటి కలుపుకొని మొదటగా 14 వేదికలను మూడు నెలల్లో పూర్తి చేయడానికి మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఇప్పటికే ఎనిమిదిమంది దాతలు ముందుకు వచ్చి వేదికలను నిర్మిస్తుండగా, మంత్రి కేటీఆర్ సొంత ఖర్చులతో ఏడు భవనాలు నిర్మించనున్నారు.
రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెరిగేనా..! - రైతు వేదికల నిర్మాణం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెరగడం లేదు. జిల్లాలోని 13 మండలాల్లో 57 రైతు వేదికలు నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు 57 క్లస్టర్లలో మూడు రైతు వేదిక భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. త్వరగా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అందులో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, బోయినిపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో వేదికలను నిర్మించడానికి పనులు ప్రారంభించారు. ఆయా నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు, గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండే స్థలాలను ఎంపిక చేశారు. ఒక సిరిసిల్ల క్లస్టర్ కోసం మాత్రం స్థలం సేకరణ ఇంకా జరగలేదు. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.16 లక్షల వరకు వ్యయం కానుంది. రైతు వేదికల నిర్మాణాల కోసం అధికారులు ఇసుకకు అనుమతులు ఇవ్వడం లేదని, ఫలితంగా నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. విజయదశమి నాటికి అన్ని భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని మొదట భావించినా, ఈ నెలాఖరు వరకే నిర్మాణ పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇవీ చూడండి: 'క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవలు మరవలేనివి'