రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల 1953లో తొలిసారిగా మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. కేవలం 12వేల జనాభా మాత్రమే ఉండే పట్టణం... వెంకంపేట, శాంతినగర్, గోపాల్‌నగర్, కొత్త బస్టాండ్, రాయిని చెరువు ప్రాంతాలు కలిసి మరింతగా విస్తరించింది. 1987లో తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటైన సిరిసిల్ల...2005లో 29 వార్డులుగా... 2014లో 33 వార్డులకు విస్తరించి ద్వితీయ శ్రేణి పురపాలిక మారింది.ప్రస్తుతం శివారులోని పెద్దూరు, సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట గ్రామాల విలీనంతో 39 వార్డులతో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించింది. పట్టణ జనాభా 91, 569 కాగా... ఓటర్లు 74 వేల 595 మందిగా ఉన్నారు.
ఎన్నికలు సాగాయలా...
1988 నుంచి 2005 వరకు ఎన్నికలు జరగ్గా పలు పార్టీలు ఛైర్పర్సన్ పీఠాలు దక్కించుకున్నాయి. 2010 నుంచి 2014 వరకు సిరిసిల్లలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. 2014లో తెరాస అభ్యర్థి సామల పావని ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. 2019 జూలై 2తో ఆమె పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.