జర్మనీ పౌరసత్వాన్ని తాను వెనక్కి ఇచ్చేశానని వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. రమేశ్ జర్మనీ పౌరుడేనని పేర్కొంటూ కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆయన కౌంటరు దాఖలు చేశారు. భారత, జర్మనీ పౌరసత్వ చట్టాలకు అనుగుణంగా ఆ దేశ పౌరసత్వాన్ని వదలుకున్నట్లు తెలిపారు.
పాత పాస్ పోర్ట్ ఉపయోగించినంత మాత్రాన జర్మనీ పౌరుడని చెప్పలేమని... ఆ దేశం ఇప్పటికే స్పష్టంచేసిందని తెలిపారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర హోంశాఖ.. తప్పుడు ఆరోపణలు చేస్తోందని కౌంటరు దాఖలు చేస్తూ ఆరోపించారు. చెన్నమనేని కౌంటరుపై సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో హైకోర్టు అంగీకరించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం.. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని స్పష్టం చేసింది. తుది వాదనలకు సిద్ధం కావాలని ఆదేశించింది.
పాత పాస్‌పోర్టుతో జర్మనీ వెళ్లడం నుంచి మెుదలైన వివాదం..
2013లోనే జర్మనీ పాస్‌పోర్టు గడువు ముగిసిందని చెబుతున్నప్పటికీ రమేశ్ అదే పాసుపోర్టుతో 2019లో ప్రయాణించారని... చెన్నమనేని పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాసరావు తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు గతంలో వాదించారు. చెన్నై విమానాశ్రయం నుంచి జర్మనీ పాస్‌పోర్టుపై ప్రయాణించిన విషయం వాస్తవమేనని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ చెప్పారు. దీంతో కేంద్ర కేంద్ర హోంశాఖ... చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. కేంద్రం తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు.