రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సీఎం పర్యటనపై సమీక్ష నిర్వహించారు. ప్రారంభానికి సిద్ధమైన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత సిరిసిల్ల అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధిస్తుందని మంత్రి అన్నారు. జిల్లా కేంద్రంలో పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు.
నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల, సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సర్దాపూర్‌లో నిర్మించిన మార్కెట్ యార్డ్, తంగళ్లపల్లి మండలం మండపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లను తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా సిరిసిల్లలో పద్మశాలి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రహదారుల వెంట శానిటేషన్, మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిసరాలను చెట్లు నాటి హరితమయం చేయాలన్నారు. విద్యుత్ దీపాల అలంకరణ తదితర హంగులను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.