రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం 'నేతన్నకు చేయూత' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు చేనేతలకు ప్రభుత్వం జమచేసే వాటా 8 శాతం ఉండగా.. ప్రస్తుతం తెరాస సర్కారు చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను.. అంటే 16 శాతాన్ని జమ చేస్తోంది. దీంతోపాటు మరమగ్గ కార్మికుల చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తోంది.
నేతన్నలకు ప్రయోజనకారి
తెలంగాణ రాకముందు కేవలం చేనేతలకే ఉన్న ఈ పథకాన్ని విస్తరించి పవర్ లూమ్ కార్మికులకు కూడా ఈ పొదుపు సౌకర్యం కల్పించారు. దీంతోపాటు గతంలో సొసైటీల పరిధిలో ఉన్న ఈ పథకం, ప్రస్తుతం చేనేత కార్మికుడితోపాటు డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు వంటి ఇతర చేనేత పనివారిని కూడా అర్హులుగా చేర్చారు. ఈ పథకం కరోనా కాలంలో నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ద్వారా రాష్ట్రంలోని నేతన్నలకు సుమారు 109 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఇంతటి ప్రయోజకారి అయిన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.