రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పట్టణం దాదాపుగా వరద నీటితో నిండిపోయింది. రద్దీగా ఉండే పాతబస్టాండ్, వెంకంపేట, ప్రగతినగర్, పెద్దబజార్, కరీంనగర్ రోడ్డు, శాంతినగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కొత్త చెరువు పూర్తిగా నిండి వరదనీరు రోడ్డుపైకి పారుతోంది. చెరువు సమీపంలో ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. భారీ వరదతో సిరిసిల్లలో జనజీవనం స్తంభించింది.
స్పందించిన కేటీఆర్
సిరిసిల్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. భారీగా వరద వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు చెరువులను గమనించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. వరదలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కుంటలు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలని... స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు.